అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
ప్రశాంతి నిలయం: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలని, ఇందుకోసం ప్రభుత్వ శాఖల అధికారులందరూ సమర్థవంతంగా పని చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయం, ప్రకృతి సేద్యం, పట్టు పరిశ్రమల శాఖ, డ్వామా, డీఆర్‌డీఏ, అటవీ శాఖ అధికారులు, లీడ్ బ్యాంక్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలు, వాటి లక్ష్యాలు, ప్రస్తుత ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజల అవసరతలను సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపై కార్యాచరణ చేపట్టాలన్నారు. జిల్లాలో పట్టుపరిశ్రమ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రతి శాఖ తమ నెలావారీ లక్ష్యాలపై స్పష్టమైన నివేదికలు అందజేయాలన్నారు.
పది సూత్రాల కార్యాచరణ పక్కాగా
అమలు చేయాలి..
పేదరిక నిర్మూలన కోసం రూపొందించిన పది సూత్రాలతో కూడిన కార్యాచరణను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఆదేశించారు. ఈ నెల 17, 18 తేదీల్లో అమరావతిలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంతో గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ మంత్రి భరద్వాజ్ పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా అధికారులతో సమీక్షించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలు, పురోగతిపై ఈ నెల 13వ తేదీలోపు సమగ్ర సమాచారంతో నివేదికలు రూపొందించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలలో సానుకూల అభిప్రాయం పెంపొందించేందుకు అధికారులంతా కృషి చేయాలన్నారు.
సిలిండర్‌పై అధికంగా వసూలు చేస్తే చర్యలు
వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ సరఫరాలలో నిర్దేశించిన ధరకంటే అధికంగా వసూలు చేస్తే గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ‘దీపం–2’ పథకం అమలుపై కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో వినియోగదారునితో గ్యాస్ బాయ్స్ అధికంగా వసూలు చేయకుండా ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే కచ్చితంగా సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తప్పవన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, సీఎస్‌డీటీలు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్


