పట్టుగూళ్ల మార్కెట్‌లో ఈ–పేమెంట్స్
● జనవరి నుంచి అమలుకు నిర్ణయం
హిందూపురం: పట్టురైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 2026 నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టుగూళ్ల మార్కెట్‌లోనూ ఈ–పేమెంట్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే హిందూపురం మార్కెట్‌కు గూళ్లు తెచ్చే రైతులకు జనవరి నుంచి ఈ–పేమెంట్స్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని పట్టుగూళ్ల మార్కెట్ అధికారి హంపయ్య తెలిపారు. ఇకనుంచి పట్టుగూళ్లు తెచ్చే రైతులంతా తప్పనిసరిగా తమ బ్యాంకు పాసుబుక్ కాపీ వెంట తెచ్చుకుని మార్కెట్ ఆఫీసులో వివరాల అందజేయాలని సూచించారు.
సుమధురం..
సాయి కీర్తనామృతం
ప్రశాంతి నిలయం: సత్యసాయి ప్రేమతత్వాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని కొనియాడుతూ నిర్వహించిన సంగీత కచేరీతో భక్తులు ఆధ్యాత్మిక సాగరంలో మునిగిపోయారు. పర్తియాత్రలో భాగంగా ప్రశాంతి నిలయానికి విచ్చేసిన సింగపూర్ సత్యసాయి భక్తులు గురువారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సంగీత కచేరీ నిర్వహించారు. రవిచంద్ర పర్చురే బృందం సుమధురంగా సత్యసాయి కీర్తనలు ఆలపించగా...భక్తజనం తరించింది.
21న పల్స్ పోలియో
● విజయవంతం చేయాలని
డీఎంహెచ్‌ఓ పిలుపు
పుట్టపర్తి టౌన్: జిలాల్లో ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తామని, అందరూ సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) ఫైరోజా బేగం పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సాయి ఆరామంలో ‘పల్స్ పోలియో’ నిర్వహణపై వైద్యాధికారులు, పర్యవేక్షణ అఽధికారులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ...21వ తేదీన 0 నుంచి ఐదేళ్ల లోపు వయస్సున్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు. ముందస్తుగా పల్స్ పోలియోపై గ్రామాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తొలిరోజే వంద శాతం లక్ష్యం పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఏదైనా కారణం చేత తొలిరోజు పోలియో చుక్కలు వేయింకోని చిన్నారులను గుర్తించి మరుసటిరోజు వేయాలన్నారు. తర్వాత వారి గృహాలను సందర్శిచి సర్వే చేసి నివేదికలు అందజేయాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుని ‘పల్స్ పోలియో’ను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అఽఽధికారి సునీల్‌కుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సురేష్ బాబు, డీపీఎంఓ నాగేంద్రనాయక్ పాల్గొన్నారు.
8న పీజీలో స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగులు సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఎస్కేయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ నరసింహన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీజీ సెట్ రాయని అభ్యర్థులు, కోర్సులో చేరాలనే ఆసక్తి ఉన్న వారు ఈ నెల 8న ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఎస్కేయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. అడ్మిషన్ సమయంలోనే కోర్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
త్వరలో కుట్టుమిషన్ల పంపిణీ
కదిరి అర్బన్: మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీలో ప్రభుత్వ అలసత్వాన్ని ప్రశ్నిస్తూ ‘మిషన్ ఫెయిల్’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ రామసుబ్బారెడ్డి స్పందించారు. జిల్లాలో 75 శాతం ముఖ హాజరుతో కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు త్వరలో కుట్టుమిషన్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మిషన్ల పంపిణీకి సంబంధించి విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో కార్యాచరణ మొదలైందని వివరించారు.
పట్టుగూళ్ల మార్కెట్‌లో ఈ–పేమెంట్స్
పట్టుగూళ్ల మార్కెట్‌లో ఈ–పేమెంట్స్


