పది శాతం వృద్ధి లక్ష్యంగా పనిచేయాలి
ప్రశాంతి నిలయం: వ్యవసాయ రంగంలో పది శాతం వృద్ధి సాఽధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగాలని జిల్లా వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులను కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఆదేశించారు. పీఎండీడీకేవై పథకం అమలుపై గురువారం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యాలయం నుంచి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి ఠాకూర్ రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖల అధికారులతో సమీక్షించారు. కంది, వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పత్తి, చిరుధాన్యాలు, ఉద్యాన, మల్బరీ పరిశ్రమలపై గ్రామీణ ప్రజలు ఆధారపడ్డారన్నారు. 2025–26 వార్షిక ప్రణాళిక ప్రకారం వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 10 శాతం వృద్ధిని సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పీఎండీడీకేవై కింద రైతులకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాము నాయక్, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, ఎల్డీఎం రమణ కుమార్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డ్వామా పీడీ విజయప్రసాద్, పశుసంవర్దకశాఖ అధికారి శుభదాస్, సెరికల్చర్ అధికారి శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సానుకూలత
పెంచేందుకు కృషి చేయండి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తున్న సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించి సానుకూల దృక్ఫథం పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఏపీ సచివాలయ నుంచి సీఎస్ విజయానంద్ వివిధ అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్‌లోని వీసీ హాలు నుంచి కలెక్టర్ శ్యాం ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల్లో సానుకూల దృక్ఫథం పెరిగేలా చూడాలన్నారు.
స్క్రబ్ టైఫస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి..
రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా... ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్క్రబ్ టైఫస్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందన్నారు. అలస్యం చేస్తే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, అవయవాల వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఐదు రోజులకు మించి జ్వరం, తీవ్రమైన తలనొప్పి, శరీరంపై నలుపు మచ్చలు, దద్దుర్లు, బలహీనత తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి డాక్టర్‌ను సంప్రదించాలన్నారు.
అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం


