ఆసుపత్రిలో పసికందు మృతి
హిందూపురం: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రెండురోజుల క్రితం పుట్టిన పసికందు గురువారం మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేగింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు... దివ్యశ్రీ, సందీప్ దంపతులు పట్టణంలోని మోడల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. తొలిసారి గర్భం దాల్చిన దివ్యశ్రీకి నెలలు నిండటంతో రెండు రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకువచ్చారు. దీంతో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టినప్పటి నుంచి బిడ్డ పాలు తాగకపోవడం... ఏడ్పు ఆపక పోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో రెండురోజులుగా వైద్యులను సంప్రదిస్తూనే ఉన్నారు. అయినా ‘‘అదంతే..మామూలే’’ అంటూ వైద్యులు చెప్పడం.. శిశువు ఏడ్పు ఆపకపోవడంతో కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు కూడా ‘‘ కొంచెం అలాగే ఉంటుంది... ఆ తర్వాత సర్దుకుంటుంది’’ అని చెప్పడంతో తిరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం కొద్దిగా పారసిటమాల్ సిరప్ తాగించారు. ఆ వెంటనే నిద్రపోయిన చిన్నారి సాయంత్రమైనా ఉలుకూ పలుకూ లేకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. దీంతో వైద్యులు శిశువును పరీక్షించి ఆక్సిజన్ పెట్టి చూశారు. అయినా కదలికలు లేకపోవడంతో చనిపోయాడని నిర్ధారించారు. దీంతో బంధువులు బోరున విలపించారు. ఉదయం వరకు బాగానే ఉన్న పిల్లాడు సిరప్ తాగినప్పటి నుంచి కదలకుండా ఉండిపోయాడని విలపించారు. ఏం జరిగిందో చెప్పకుండా పిల్లాడ్ని ఇలా చేశారన్నారు.
ఆసుపత్రిలో పసికందు మృతి


