‘కల్లు’ తేలేసినా.. కళ్లు మూసుకునే!
హిందూపురం: కల్తీకల్లుతో జనం కల్లు తేలేసినా... ఎకై ్సజ్ అధికారులు మాత్రం కళ్లు తెరవడం లేదు. అమ్యామ్యాలకు అలవాటు పడిన కొందరు అధికారులు ‘కల్తీకల్లు’ యథేచ్ఛగా పారుతున్నా కళ్లుమూసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధి హైదరాబాద్‌కే పరిమితం కాగా, ఆయన అనుయాయులు అందిన కాడికి దండుకుంటూ జనం ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు.
కల్తీకల్లే ఎక్కువ..
జిల్లాలోని హిందూపురం, కదిరి, ధర్మవరం, మడకశిర తదితర నియోజకవర్గాల్లో కల్లు విక్రయాలు భారీగా జరుగుతాయి. అయితే ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే కల్లు పరిమాణం చాలా తక్కువగా ఉండగా.. విక్రయించే కల్లు మాత్రం వేలాది లీటర్లు ఉంటుంది. ఇందుకు ‘కల్తీ’నే ప్రధాన కారణంగా తెలుస్తోంది. కల్లును ఆదాయ వనరుగా మార్చుకున్న కొందరు ‘కల్తీ కల్లు’తో రూ.కోట్లు కూడబెడుతున్నారు. విషరసాయనాలతో తయారైన ఈ కల్తీ సరుకు తాగి జనం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కల్తీని అరికట్టాల్సిన అధికారులు కూడా వ్యాపారులకే వంతపాడుతూ జేబులు నింపుకుంటున్నారు.
చౌళూరు ఘటన తర్వాత హడావుడి..
ఇటీవల హిందూపురం మండలం చౌళూరు గ్రామంలో కల్లుతాగి 13 మందికి పైగా అస్వస్థతకు గురికాగా, ఎకై ్సజ్ అధికారులతో పాటు పోలీసులు కూడా రెండురోజుల పాటు హడావుడి చేశారు. పోలీసులు ఓ వ్యాపారిని, ఓ దుకాణ యజమానిని అరెస్టు చేశారు. ఎకై ్సజ్ అధికారులు రెండు, మూడు రోజులు కల్లు దుకాణాల్లో తనిఖీలు చేశారు. లైసెన్స్‌లేని నాలుగు దుకాణాలను తొలగించడంతో పాటు కేసులు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ పోలీసులు చెబుతున్నారు. అలాగే డివిజన్ వ్యాప్తంగా ఇప్పటివరకు 290 వరకు కల్లు నమునాలను సేకరించామని, నాలుగు రోజుల కిందట మరో 14 నమూనాలు తీసుకున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పలు కల్లు దుకాణాల్లో నమూనాలు సేకరించి వాటిని ల్యాబ్‌కు పంపి చేతులు దులుపుకున్నారు. ల్యాబ్ రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
పచ్చ నేతల కనుసన్నల్లోనే ‘కల్తీ’ వ్యాపారం..
హిందూపురం నియోజకవర్గంలో కల్తీకల్లు వ్యాపారం నియోజకవర్గ ముఖ్యనేత కార్యాలయం అనుమతితోనే సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు నెలనెలా సదరు నేత కార్యాలయానికి రూ.లక్షల్లో కప్పం కడతారని, అలాగే ఎకై ్సజ్, పోలీసు అధికారులకూ వారు అడిగినంత ముట్టజెపుతారని తెలుస్తోంది. అందుకే చౌళూరులో అంత పెద్ద ఘటన జరిగినా ఎవరూ పెద్దగా స్పందించడం లేదని స్థానికులు చెబుతున్నారు.
అన్నీ పాజిటివ్...మరి అస్వస్థత ఎలా..?
గతంలో అధికారులు సేకరించిన కల్లు నమూనాలన్నీ పాజిటివ్ రిపోర్టు రావడం పట్ల జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కల్లు స్వచ్ఛంగా ఉంటే... తాగిన ప్రజలు ఎందుకు అస్వస్థతకు గురయ్యారో అర్థం కాని ప్రశ్న. గతంలో తీసుకున్న వందలాది నమూనాలు కూడా పాజిటివ్ వచ్చాయని, ఇప్పుడు తీసుకున్న నమూనాలు కూడా పాజిటివ్ వస్తాయని, ‘నెగిటివ్’ అనే మాట ఉండదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా నమూనాలన్నీ పాజిటివ్ వచ్చేందుకు పెద్ద తతంగమే నడుస్తోందంటున్నారు.
ఇంకా బెంగళూరులోనే ఇద్దరు..
చౌళూరులో కల్లుతాగి అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు ఇంకా బెంగళూరులోనే బంధువుల ఇళ్లలో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కల్తీకల్లుకు అలవాటు పడి రోగాల బారిన పడిన వారు వింతవింతగా ప్రవర్తిస్తుండటంతో కుటుంబీకులు మెరుగైన వైద్య చికిత్స కోసం అక్కడే ఉంచినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
‘కల్తీ కల్లు’ ఘటనపై
తూతూ మంత్రంగా విచారణ
నమూనాలు ల్యాబ్‌కు పంపి
సరిపెట్టిన అధికారులు
నేటికీ కొలుకోలేని ‘చౌళూరు’ బాధితులు
ఇద్దరికి ఇంకా బెంగళూరులోనే చికిత్స
ఫలితాలు వస్తే చర్యలు
జిల్లాల్లో కల్లు విక్రయాలపై ఇప్పటికే తనిఖీలు చేస్తున్నాం. ‘చౌళూరు’ ఘటన తర్వాత కల్లు దుకాణాల్లో రోజు తనిఖీలు నిర్వహిస్తున్నాం. నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నాం. ఏదైనా మత్తు కలిపినట్లు తెలితే ఎవరినీ వదిలేది లేదు.
–గోవిందనాయక్, ఎకై ్సజ్, ప్రొహిబిషన్
జిల్లా అధికారి


