రూ.86 లక్షల అవినీతిపై ఆడిట్
చిలమత్తూరు: చేయని పనులకూ బిల్లులు చేసుకుని రూ.86 లక్షలు స్వాహా చేసిన అంశంపై ఆడిట్ అధికారులు ఆలస్యంగా స్పందించారు. 2024లో చిలమత్తూరు మేజర్ పంచాయతీలో జరిగిన ఈ స్వాహా పర్వంపై తాజాగా స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. కొందరు అధికార పార్టీ నాయకుల అండతో చిలమత్తూరు మేజర్ పంచాయతీలో నిధులు దారిమళ్లిన అంశంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో అధికారులు విచారణకు ఆదేశించగా పదిరోజులుగా ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 2024లోనే రూ.86 లక్షలు అవినీతి జరిగినట్టు గుర్తించిన అధికారులు... ఇటీవలే పంచాయితీ కార్యదర్శి రామ్లానాయక్‌ను సస్పెండ్ చేశారు. అయితే ఇందులో కీలకంగా వ్యవహరించిన టీడీపీ నేత నందీశప్ప... సర్పంచ్ సంధ్యను బెదిరించి తన బినామీల పేరుతో 15వ ఆర్థిక సంఘం నిధులు దోచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పంచాయతీరాజ్ కమిషనర్ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆడిట్‌శాఖ అధికారులు డీపీఓ గతంలో సీజ్ చేసిన ఎం బుక్కులను తెప్పించారు. సస్పెండ్ అయిన రామ్లానాయక్ పనిచేసిన మొరసలపల్లి, చాగలేరు, చిలమత్తూరు పంచాయతీల్లో చేసిన పనులు, నిధుల మంజూరు వివరాలను అసిస్టెంట్ ఆడిట్ అధికారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఏ మేరకు పనులు చేశారు..ఎంత బిల్లులు పెట్టారు...నిధుల మంజూరు తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కాగా, బెదిరించి నిధులు దోచుకున్న కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే కార్యాలయం అండగా ఉండటంతో... వారిని వదిలి అధికారులపై మాత్రమే చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
చిలమత్తూరు పంచాయతీ
రికార్డుల పరిశీలన
‘సాక్షి’ కథనాలతో మేల్కొన్న అధికారులు


