మెడికల్ కాలేజీలపై ‘కూటమి’ కుట్ర
పెనుకొండ: పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే... కూటమి ప్రభుత్వం వాటిని కార్పొరేట్ వర్గాలకు అప్పగించేందుకు కుట్ర పన్నిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విమర్శించారు. గురువారం ఆమె పరిగి మండలం ఊటుకూరు గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేసి పేదల జీవితాలతో ఆడుకున్న తీరును వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు, పేద కుటుంబాల్లోని విద్యార్థుల డాక్టర్ కలను సాకారం చేసేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారన్నారు. అందులో ఐదు మెడికల్ కళాశాలలో అందుబాటులోకి కూడా వచ్చాయన్నారు. మిగతా వాటిని పూర్తి చేయాల్సిన కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ప్రైవేటు పరం చేసి రూ.కోట్లు దోచేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. తాను విజన్ ఉన్న నేతనని, 40 ఏళ్ల రాజకీయ అనుభవమని గొప్పలు చెప్పుకుని చంద్రబాబుకు పేదలపై ఉన్న చిత్తశుద్ధికి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణే నిదర్శనమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పేదల పక్షాన వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టిందన్నారు. అందులో భాగంగానే కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ వైఖరిని గ్రామీణులతో పాటు పట్టణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పరిగి మండల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
మాజీ మంత్రి, వైస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్


