‘సాక్షి’ కథనంతో గుబులు.. | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ కథనంతో గుబులు..

Nov 6 2025 8:30 AM | Updated on Nov 6 2025 8:30 AM

‘సాక్షి’ కథనంతో గుబులు..

‘సాక్షి’ కథనంతో గుబులు..

అధికారులు అమ్యామ్యాలకు కక్కుర్తిపడ్డారు. కాసుల కోసం కొండలు కరిగిస్తున్నా కన్నెత్తి చూడరు...ప్రకృతినే చెరబట్టి పైసలు పోగేసుకుంటున్నా పట్టించుకోరు.. మనీ కోసం ఇష్టానుసారం మైనింగ్‌ చేస్తున్నా...‘మామూళ్లు’గా తీసుకుంటారు. వీరి అండతోనే మైనింగ్‌ మాఫియా ఏకంగా అడవినే అక్రమించేందుకు సిద్ధమైంది. ఎర్రకొండపై వాలిన పచ్చదండు గురించి ‘సాక్షి’ సాక్ష్యాలతో ప్రచురించినా... అధికారులు మాత్రం అధికారపార్టీ నేతకే అండగా నిలవడం చూసి జనం చీదరించుకుంటున్నారు.

గుండుమల మైనింగ్‌కు

బలయ్యే కొండ ప్రాంతం ఇదే..

చిలమత్తూరు: హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలో 2,500 హెక్టార్లలోని ఎర్రకొండపై పచ్చదండు వాలడం వెనుక అధికారుల అండ ఉన్నట్లు తెలుస్తోంది. అటవీప్రాంతాన్ని శోత్రియం భూముల పేరుతో టీడీపీకి చెందిన గోపీనాథ్‌ అనే వ్యక్తి చేజిక్కించుకోవడం..ఇప్పుడా భూముల్లో టీడీపీ నేత గుండుమల తిప్పేస్వామి మైనింగ్‌కు సిద్ధపడటం వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు సమాచారం. అటవీ స్థలానికి రైత్వారీ పట్టాలు పుట్టించడం మొదలు...అటవీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌కు అనుమతులు ఇచ్చే దాకా అన్నీ అధికారుల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. ఎర్రకొండపై పచ్చదండు చేస్తున్న అకృత్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

జీటీఎస్‌ పేరుతో...

చిలమత్తూరు మండలంలోని యగ్నిశెట్టిపల్లి సమీపంలోని శ్రీధరగుట్టలో గతంలో టీడీపీ నేత గుండుమల తిప్పేస్వామి అక్రమంగా మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించారు. కొండను ఇష్టారాజ్యంగా కరిగించి మైనింగ్‌ నిర్వహించారు. క్రషర్‌ ఏర్పాటు చేసి భారీగా దోచేశారు. ఒక చోట అనుమతి పొంది మరోచోట తవ్వకాలు జరిపారు. ఎక్కడ పడితే అక్కడ పేలుడు పదార్థాల ద్వారా సర్వనాశనం చేశారు. అయితే గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో గుండుమల అక్రమ మైనింగ్‌కు చెక్‌ పడింది. అయినా క్వారీని అనధికారికంగా నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గుండుమల కన్ను అటవీ ప్రాంతంలోని మరోకొండపై పడింది. ఓ పక్క అడవి, మరోవైపు రైతుల పంట పొలాలు ఉన్నా... గుండుమల జీటీఎస్‌ పేరుతో క్రషర్‌ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. పనులు ముమ్మరం చేశారు. దట్టమైన వృక్షాలున్న ప్రాంతంలో పేలుడు పదార్థాలను వినియోగించి కొండల్ని పిండి చేస్తున్నారు.

అక్రమానికి అధికారుల మద్దతు..

అటవీ ప్రాంతంలో మైనింగ్‌ నిర్వహించకూడదని నిబంధనలున్నా...అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ మార్గంలో... తప్పుడు నివేదికల ద్వారా అనుమతులు పొందినట్టు తెలుస్తోంది. రైతులకు ఇష్టం లేకపోయినా దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి చెట్లు నరికేస్తున్నా అటవీశాఖ అధికారులు కళ్లు మూసుకున్నారు. కొండలకు, గుట్టలకు రైత్వారీ పట్టాలిచ్చినా... రెవెన్యూ యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తోంది. మైనింగ్‌ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. అక్రమార్కులకు అండగా నిలుస్తున్న అధికారులు ప్రజల గోడు మాత్రమూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కలపను ఏం చేశారు...?

మైనింగ్‌ కోసం అడ్డదారుల్లో అనుమతులు పొందిన కూటమి నేతలు వృక్ష సంపదను నేలకూల్చారు. ఆ సంపదలో ఎర్రచందనం, సిరిగంధం, వేప, చింత, కానుగ వృక్షాలు దట్టంగా ఉండేవి. తొలగించిన ఆ వృక్ష సంపదను కూటమి నేతలు ఏం చేశారన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. లారీల్లో కర్ణాటకకు గుట్టు చప్పుడు కాకుండా తరలించినట్టుగా స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఎర్రచందనం, సిరిగంధం లాంటి విలువైన వృక్ష సంపదను అనధికారికంగా విక్రయించి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. ఫారెస్ట్‌ అధికారుల మాత్రం అది అడవి కాదని ప్రైవేటు భూమి అని పేర్కొనడం గమనార్హం.

ఇరిగేషన్‌ కాలువలు మూత..

క్రషర్‌ ఏర్పాటు చేసే ప్రాంతానికి వెళ్లాలంటే కొండను కరిగించడంతో పాటు దట్టమైన వృక్ష సంపదనూ తొలగించాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పటికే కొండను కరిగించారు, వృక్ష సంపదనూ నరికివేశారు. రైతుల పొలాలను లాక్కున్నారు. ముఖ్యంగా కొండల నుంచి కిందకు వచ్చే నీటి కాలువలను అన్నీ బంద్‌ చేశారు. రోడ్డు పనులు చేయడం ద్వారా నీరంతా పొలాల్లోకి వెళ్తూ పంటలకు నష్టాన్ని చేకూరుస్తోంది. ఇరిగేషన్‌ అధికారులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు.

ఎర్రకొండ అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలపై ఉదాసీనత

కళ్లు మూసుకున్న రెవెన్యూ,

అటవీ, మైనింగ్‌ అధికారులు

‘వాల్టా’ ఉల్లంఘించి చెట్లు నరికినా పట్టించుకోని వైనం

‘పచ్చదండు’ సహజ వనరుల దోపిడీని చూసి విస్తుపోతున్న జనం

‘ఎర్రకొండపై పచ్చదండు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అక్రమాలన్నీ వెలుగులోకి రావడంతో ఏం చేయాలన్న సందిగ్ధంలో పడినట్టుగా తెలుస్తోంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా రైతులను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు అక్రమంగా రైత్వారీ పట్టాలు పొందిన టీడీపీ నేత గోపీనాథ్‌పై స్థానిక ప్రజలు, రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. భూములన్నీ తనవే అంటూ లాక్కోవడం, అక్రమంగా అధికారులను అడ్డం పెట్టుకొని సంపాదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ కేశప్ప మైనింగ్‌ జరిగే ప్రాంతాన్ని, చెట్లు నరికివేసిన ప్రాంతాన్ని తనిఖీ చేశారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు వెళ్లకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement