ప్రశాంతి నిలయంలో భద్రత కట్టుదిట్టం
పుట్టపర్తి టౌన్: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ప్రశాంతి నిలయంలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులతో కలిసి ప్రశాంతి నిలయం ప్రవేశ ద్వారాలు, సాయికుల్వంత్ సభామందిరం, పూర్ణచంద్ర ఆడిటోరియం, శాంతిభవన్ అతిథి గృహం, మహా నారాయణసేవ నిర్వహించే మైదానాలను పరిశీలించారు. బాబా శత జయంత్యుత్సవాలకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులతోపాటు వీవీఐపీలు, వీఐపీలు ప్రశాంతి నిలయానికి విచ్చేయనున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకూడదని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పుట్టపర్తిలోని పలు ప్రాంతాలతో పాటు విమానాశ్రయం, పార్కింగ్‌స్థలాలను ఎస్పీ పరిశీలించారు. ఎస్పీ వెంట డీఎస్పీ విజయకుమార్, సీఐలు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, శివాంజనేయులతో పాటు సిబ్బంది ఉన్నారు.
భక్తులపై బీరు బాటిళ్లు
● విసిరిన అగంతకులు
● పెనుకొండలో ఘటన
పెనుకొండ: పట్టణంలో గ్రామోత్సవంగా వెళ్తున్న భక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిళ్లు విసిరారు. ఈ ఘటనపై పలువురు పట్టణ ప్రముఖులు, భక్తులు, వీహెచ్‌పీ నాయకులు బుధవారం ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. వారందించిన సమాచారం మేరకు.. మంగళవారం రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా పెనుకొండలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు భజనలు చేసుకుంటూ ముందుకు సాగారు. స్థానిక వెంకటేశ్వర టాకీస్ సమీపంలోకి వెళ్లగానే గుర్తు తెలియని దుండగులు రెండు బీరు బాటిళ్లు విసిరారు. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. నిందితులను పట్టుకుని తగిన చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో కోరారు.
12న అఖిల భారత సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలు
పుట్టపర్తి టౌన్: జిల్లా స్థాయి అఖిల భారత సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలను ఈనెల 12వ తేదీన పెనుకొండ, ధర్మవరంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అఽధికారి ఉదయభాస్కర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పెనుకొండ కెవీఆర్‌లో బ్యాడ్మింటన్, ధర్మవరం జెడ్పీహెచ్‌ఎస్‌లో బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, హాకీ, వాలీబాల్ తదితర కీడల్లో పోటీలు జరుగుతాయన్నారు. ధర్మవరం కళాజ్యోతిలో స్విమ్మింగ్, టేబుల్ టెన్నీస్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, క్యారమ్స్, చెస్, లాన్ టెన్నీస్, యెగా, డ్యాన్స్, మ్యూజిక్ తదితర విభాగాలకు సంబంధించి పోటీలు ఉంటాయన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు.
ప్రశాంతి నిలయంలో భద్రత కట్టుదిట్టం


