తలుపులు మూసి.. సెల్‌ఫోన్లు లాక్కుని
చిలమత్తూరు: స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్ జయమ్మ, సిబ్బంది ఉదయం 11.30 గంటలకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. వచ్చీరావడంతోనే కార్యాలయం తలుపులు మూసి వేసి ఆ సమయంలో కార్యాలయంలో ఉన్న అందరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి పొద్దుపోయేదాకా సోదాలు చేపట్టారు. రికార్డులను పరిశీలించి సిబ్బంది లావాదేవీలు ఆరా తీశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన ఆదాయం, ఒక్కో డాక్యుమెంట్‌కు వసూలు చేసిన చార్జీల వివరాలను సేకరించారు. అనుమానం వచ్చిన డాక్యుమెంట్ల రికార్డుల సాఫ్ట్‌కాపీలను సేకరించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారిణి జయమ్మ ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. భూసేకరణలో మీ పాత్ర ఏమిటని అడగటంతో పాటు వివిధ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లను ప్రస్తావిస్తూ ప్రశ్నలు సంధించారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన ప్రజలనూ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరి వివరాలు, ఫోన్ నంబరు తీసుకున్నారు. ఆ సమయంలో రవి అనే డాక్యుమెంటు రైటర్ కార్యాలయంలో ఉండటంపై ‘ఇక్కడ మీకేం పని’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో కార్యాలయం స్టాంపులు వేసే గదిలో రూ.2,500 వరకు నగదు లభించింది. ఆ డబ్బు విషయమై అక్కడున్న ఉద్యోగిని ప్రశ్నించగా...తనది కాదన్నారు. దీంతో ఏసీబీ అధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
ముందే సమాచారం అందిందా..?
అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న చిలమత్తూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తే ఏమీ దొరకకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన వెంకటనారాయణ అనే సబ్‌రిజిస్ట్రార్‌ను అక్రమ రిజిస్ట్రేషన్లు, అవినీతి వ్యవహారంలో ఉన్నతాధికారులు ఇటీవలే సస్పెండ్ చేశారు. తాత్కాలిక సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రసాద్ బాబు సైతం అక్రమ రిజిస్ట్రేషన్లు, పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేయడం వంటి అంశాల్లో ఆరి తేరారని, ఇందుకోసం భారీగానే ముడుపులు తీసుకుంటారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేసినా...నగదు దొరకకపోవడంపై చూస్తే... ఏసీబీ దాడుల సమాచారం అధికారులకు ముందస్తుగా అందిందా... అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరి అధికారుల ద్వారా కూటమి నేతలకు, అక్కడి నుండి సబ్ రిజిస్ట్రార్‌కు సమాచారం రావడంతోనే నగదును ముందస్తుగానే బయటకు తరలించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చిలమత్తూరు సబ్‌రిజిస్ట్రార్
కార్యాలయంపై ఏసీబీ దాడులు
రాత్రి పొద్దుపోయేదాకా
కొనసాగిన సోదాలు
ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌తో పాటు
సిబ్బంది బ్యాంకు, పాన్ వివరాలు,
ఆర్థిక లావాదేవీలపై ఆరా
వచ్చీరావడంతోనే కార్యాలయం
తలుపులు మూసివేశారు. ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు అందరినీ కార్యాలయంలోనే నిర్బంధించి సోదాలు చేశారు. ప్రతి రికార్డూ పరిశీలించారు. కార్యాలయంలోని అణువణువూ శోధించారు. వచ్చినవారు ఏసీబీ అధికారులని తేలడంతో అటు అధికారులతో పాటు, ఇటు జనాలకు ముచ్చెమటలు పట్టాయి.


