రేపు కార్తీక వనసమారాధన
ప్రశాంతి నిలయం: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈనెల 7వ తేదీన పుట్టపర్తి మండల పరిధిలోని అమగొడపాళ్యం నగరవనంలో కార్తీక వన సమారాధన జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రకృతి పరిరక్షణ, చెట్ల పెంపకం, వాతావరణ మార్పుల వల్ల కలిగే అనర్థాలు...వాటిని నివారించే మార్గాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ‘వనం మనం–స్వచ్ఛ ఆంధ్ర’ థీమ్‌పై జిల్లా వ్యాప్తంగా కళాశాల యువతీ యువకులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, చిత్రలేఖన పోటీలు నిర్వహించి... విజేతలకు వన సమారాధన కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామన్నారు. ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష పుస్తకాల విడుదల..
జాతీయ ఉపకార వేతన అర్హత పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్)కు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం జన విజ్ఞాన వేదిక (జేవీవీ), ఐక్య ఉపాధ్యాయ సంఘం (యూటీఎఫ్) రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలో అర్హత సాధిస్తే కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.12 వేల చొప్పున నాలుగేళ్ల పాటు ఉపకారవేతనం అందిస్తుందన్నారు. విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఈఓ బి.కిష్టప్ప, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ డాక్టర్ పి.దేవరాజ్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జేవీవీ రాష్ట్ర కార్యదర్శి ఎం.ఆదిశేషు, జిల్లా అధ్యక్షుడు బి.నరసారెడ్డి, ప్రధాన కార్యదర్శి లోకేష్, కార్యదర్శి లక్ష్మీనారాయణ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాం ప్రసాద్


