సాగులో రైతుకు సాయంగా నిలవండి
ప్రశాంతి నిలయం: ఆరుగాలం కష్టపడి సేద్యం చేసే రైతులకు సాయంగా నిలవాలని అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలుపై వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ‘ధన్ ధాన్య కృషి యోజన’ పథకాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, ఆహార భద్రతను సాధించే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈపథకం రైతులకు మేలు చేయాలన్నారు. ఉత్పాదకత పెంచడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, నీటి పారుదల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం తదితర వాటితో రైతుల ఆదాయం పెంపునకు ప్రణాళిక ఉండాలన్నారు. వ్యవసాయంలో ఆధునిక యంత్రాలను వినియోగించుకునేలా రైతులకు శిక్షణ ఇవ్వడం, సబ్సిడీలు అందజేయడం, ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహంతో పాటు పంట నష్ట పరిహారం సకాలంలో అందిస్తూ రైతులకు చేయూత నివ్వాలన్నారు. జిల్లాలోని రైతులందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రామునాయక్, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, ఎల్డీఎం రమణకుమార్, పరిశ్రమల శాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
‘ధన్ ధాన్య కృషి’ కార్యాచరణ
రూపొందించండి
అధికారులకు కలెక్టర్ ఆదేశం


