 
															ఎంఈఓ రామచంద్రప్ప సస్పెన్షన్
అనంతపురం సిటీ: జిల్లాలోని గుమ్మఘట్ట మండల విద్యా శాఖాధికారి(ఎంఈఓ)గా పని చేస్తున్న హరిజన రామచంద్రప్ప సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం విద్యా శాఖ కడప ప్రాంతీయ సంచాలకుడు శామ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా హరిజన రామచంద్రప్ప పనిచేశారు. ఆ సమయంలో నాడు–నేడు పథకం కింద మంజూరైన రూ. లక్షల నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. తాజాగా విచారణాధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎంఈఓ రామచంద్రను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ కార్యాలయ అధికారులు తెలిపారు. అయితే తనను ఏకపక్షంగా సస్పెండ్ చేశారంటూ ఎంఈఓ రామచంద్ర విలేకరులతో వాపోయారు.
వివాహిత ఆత్మహత్య
కదిరి టౌన్: స్థానిక ఆడపాలవీధిలో నివాసముంటునన వివాహిత మంజుల(30) ఆత్మహత్య చేసుకుంది. 15 ఏళ్ల క్రితం ఆమెను భర్త వదిలేశాడు. 14 సంవత్సరాల వయసున్న కుమారుడితో కలసి జీవిస్తోంది. పట్టణంలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న ఆమెను నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తుండడంతో మనస్తాపం చెంది బుధవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ధనుంజయరెడ్డి తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
