
చీనీ ఆశలపై ‘చిరుజల్లు’
తాడిమర్రి: చీనీ రైతుల ఆశలపై ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. పంటకోత తర్వాత దాదాపు నెలరోజుల పాటు చెట్లను ‘వాడు’ (నీళ్లు పెట్టకపోవడం) పెడతారు. ఆ తర్వాత నీరు పెడితే పూత బాగా వచ్చి పిందెలు కూడా ఆశించిన స్థాయిలో వస్తాయి. కానీ రెండు నెలలుగా రోజు విడిచి రోజు కురుస్తున్న వర్షాలతో చీనీ రైతులు కుదేలయ్యారు. చీనీచెట్లను రైతులు వాడు పెట్టినా నిత్యం చిరుజల్లులు కురుస్తుండటంతో చీనీ చెట్లు పూతకు కూడా నోచుకోలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
37,500 ఎకరాల్లో విస్తరించిన
చీనీ తోటలు..
ఎర్రనేలల్లో సాగయ్యే చీనీ నాణ్యతగా ఉండటంతో పాటు తీపిదనం ఎక్కువగా ఉండటం వల్ల మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జిల్లాలోని రైతులు ఎర్ర నేలలున్న ప్రాంతంలోనే చీనీ సాగు చేస్తున్నారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం, కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో అధికం చీనీ తోటలు ఉన్నాయి. ఇక పెనుగొండ రెవెన్యూ డివిజన్‌లో కొన్ని మండలాల్లో రెండు, మూడు వందల ఎకరాల్లో రైతులు చీనీ తోటలను సాగు చేస్తున్నారు. మొత్తంగా 37,500 ఎకరాల్లో చీనీ తోటలు విస్తరించాయి. దాదాపు 4.50 లక్షలు చీనీ చెట్లను రైతులు సాగు చేస్తున్నారు.
దిగుబడిపై వర్షాల దెబ్బ..
ఎకరాకు 120 చెట్ల ప్రకారం ఐదు ఎకరాల్లో 600 చెట్లు ఉంటే ఆశించిన దిగుబడి, మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభిస్తే రైతు రూ.లక్షల్లో ఆదాయం చూస్తాడు. ఏడాదికి రెండు పంటలు కావడంతో రైతుకు చీనీ పంట ఎంతో లాభసాటిగా ఉంటుంది. కానీ ఇటీవల వరుసగా కురుస్తున్న తేలికపాటి వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఒక పంట, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మరో పంట చేతికి వస్తుంది. చీనీ తోటల్లో పూత రావడానికి ముందుగా రైతులు దాదాపు నెలరోజుల పాటు చెట్లకు నీరు పెట్టకుండా ‘వాడు’ పెడతారు. చెట్లకు ఎరువులు వేసి వాడు పెట్టిన అనంతరం ఒక్కసారి నీరు పెడితే విపరీతంగా పూత వచ్చి, పిందెలు అధికంగా వస్తాయి. దీంతో రైతుకు ఆశించిన మేర పంట దిగుబడి వస్తుంది. కానీ ప్రస్తుతం రైతులు తోటలను వాడు పెట్టగా.. వారానికి రెండు, మూడు సార్లు జల్లులు కురుస్తున్నాయి. దీంతో తోటల్లో తడి ఆరక వాడు రాకపోగా పేనుబంక, పులుసు తెగులు సోకుతున్నాయని రైతు ఆవేదన చెందుతున్నారు. ఎన్ని మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేదంటున్నారు. ఉద్యాన అధికారులు చీనీ తోటలను పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు.
పూత లేదు.. పిందె రాదు
ఇటీవలి వర్షాలతో దెబ్బతిన్న చీనీ
ఆందోళన చెందుతున్న రైతులు

చీనీ ఆశలపై ‘చిరుజల్లు’

చీనీ ఆశలపై ‘చిరుజల్లు’