
పాలన చేతగాకే పత్రికలపై కేసులు
పరిగి: ‘‘కూటమి ప్రభుత్వానికి ఎలా పాలించాలో తెలియడం లేదు. ఆ పార్టీల్లోని వారంతా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. చివరకు మద్యాన్ని కల్తీ చేసి జనాల ప్రాణాలు తీస్తున్నారు. పేదలకు వైద్యం అందించే వైద్య కళాశాలలను కమీషన్ల కోసం ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్ అవినీతి, అక్రమాలకను సాక్ష్యాలతో సహా ‘సాక్షి’ మీడియా ప్రజల ముందు ఉంచుతోంది. దీన్ని జీర్ణించుకోలేని కూటమి పాలకులు అక్రమ కేసులతో ‘సాక్షి’ సంపాదకుడితో పాటు జర్నలిస్టులను భయపెట్టాలని చూస్తున్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అవినీతి కూటమి సర్కార్‌ను తప్పక కూలదోస్తారు’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. శుక్రవారం ఆమె పరిగిలో విలేకరులతో మాట్లాడారు. నిజాలు నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ ప్రతినిధులపై ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు. పోలీసులను ‘సాక్షి’ కార్యాలయంలోకి పంపడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనన్నారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నాయకులపై కూడా అక్రమ కేసులు పెట్టారన్నారు. కేసులకు, బెదిరింపులకు ఎప్పుడూ భయపడేది లేదని, ప్రజల కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న అధికార యంత్రాంగం తీరు మార్చుకోవాలన్నారు.
సుగాలి ప్రీతికి పవన్‌కళ్యాణ్ ఏం న్యాయం చేశారు..
సుగాలి ప్రీతి కుటుంబానికి డిప్యూటీ సీఎంగా ఏం న్యాయం చేశారో పవన్‌కళ్యాణ్ చెప్పాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. న్యాయం కోసం ప్రీతి కుటుంబసభ్యులు ధర్నా చేస్తున్నా నోరు ఎందుకు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని పాలిస్తారా... అని మండిపడ్డారు. కూటమి నాయకులకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఇకనైనా ప్రజా సమస్యలపై గళమెత్తిన వారిపై కక్ష సాధింపులకు దిగడం మానుకోవాలని హితవుపలికారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అవినీతి, అక్రమాలను బయటపెడుతోందనే
‘సాక్షి’పై కూటమి కక్ష
పత్రికా సంపాదకుడినే అక్రమ కేసులతో
బెదిరించడం దుర్మార్గం
కార్యాలయాలపైకి పోలీసులను ఉసిగొల్పి
రచ్చ చేయడం నియంతృత్వం
కూటమి సర్కార్‌పై నిప్పులు చెరిగిన
మాజీ మంత్రి ఉషశ్రీచరణ్