
కుల గణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు
సాక్షి, పుట్టపర్తి/ పుట్టపర్తి టౌన్: రాష్ట్రంలో కులగణన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కుల గణన అంశంపై సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వేమయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 143 వెనుకబడిన కులాలు ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గడంతో అవకాశాలను కోల్పోవాల్సి వస్తోందని తెలిపారు. ఈ అంశంలో ప్రభుత్వంపై బీసీ సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్ మాట్లాడుతూ బీసీల రక్షణ చట్టం తీసుకొస్తామంటూ ఎన్నికలకు ముందు హామీనిచ్చిన కూటమి పెద్దలు అధికారం చేపట్టిన తర్వాత ఆ ఊసే మరచిపోయారన్నారు. కులగణన చేపట్టిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
నెరవేర్చలేని స్థితిలో ఉన్నాం..
ఎన్నికల హామీలను నెరవేర్చలేని మాట వాస్తవమేనని హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి అంగీకరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేనందున హామీల అమలు కష్టంగా ఉందన్నారు. బీసీల అంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేటీ శ్రీధర్, టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్, నాయకులు పైపల్లి గంగాధర్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్టాల శ్రీరాములు, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు చంద్రమోహన్, చేతివృత్తుల సంఘం నాయకుడు జింకా చలపతి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి
రామకృష్ణ డిమాండ్
హామీలను నెరవేర్చలేక
పోతున్నాం : ఎంపీ బీకే