
దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలి
ధర్మవరం: దొంగ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండటంతో పాటు వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బీఎల్‌ఏలతో అన్నారు. మంగళవారం ఆయన స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలకు చెందిన బీఎల్‌ఏ (బూత్ లెవల్ ఏజెంట్)లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ... దేశంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరిట ఎన్నికల సంఘం ఓటరు జాబితాను సమీక్షించి కొత్త జాబితాను రూపొందిస్తోందన్నారు. గతంలో బిహార్‌లో ఎస్‌ఐఆర్ పేరిట విడుదల చేసిన కొత్త జాబితాలో 60 లక్షల దాకా ఓట్లు గల్లంతయ్యాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ సర్వే అక్టోబర్ నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సర్వేలో వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు, అర్హులైన ప్రజల ఓట్లు గల్లంతు కాకుండా బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్వే ప్రారంభమయ్యేలోపు అర్హులైన ఓటరు జాబితాను సిద్ధం చేసుకోవాలని బీఎల్‌ఏలకు సూచించారు. తద్వారా ఎన్నికల సిబ్బంది చేసే తప్పులను వెంటనే ఎత్తి చూపవచ్చన్నారు. లేకపోతే అధికార పార్టీ నాయకులు ఎంతకై నా తెగిస్తారన్నారు. 2014 ఎన్నికల్లో 14 వేలకుపైగా దొంగ ఓట్లను ఎక్కించారని, దీన్ని తాను రాష్ట్రస్థాయిలో ఆధారాలతో సహా చూపి టీడీపీ నాయకుల బండారం బయటపెట్టానన్నారు. 2018లోనూ కోర్టులకు వెళ్లి నియోజకవర్గంలో 19 వేల దొంగఓట్లను కట్టడి చేశామన్నారు. 2024 ఎన్నికలకు ఒక నెల ముందు దాదాపుగా 20 వేల ఓట్లు మళ్లీ ఎక్కించారని, ఇలా.. విలువలు పక్కన పెట్టి దొంగఓట్లతో ప్రత్యర్థులు దొడ్డిదారిన గెలుస్తున్నారన్నారు. అందువల్లే బీఎల్‌ఏలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లు గల్లంతు కాకుండా చూడాలి
బీఎల్‌ఏలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సూచన
బీజేపీ గెలుపుతోనే అనుమానాలు
ధర్మవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపీకి 600 ఓట్ల ఆధిక్యం మాత్రమే వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం ఆ పార్టీ గుర్తుపై కూడా ప్రజలకు ఇప్పటికీ అవగాహన లేదన్నారు. అలాంటి పార్టీ ఎన్నికల్లో గెలవడం ఏమిటని ప్రశ్నించారు. దీన్నిబట్టి చూస్తే ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. ఇక గత ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధర్మవరంలో పర్యటించిన రోజే రాష్ట్ర డీజీపీని మార్చడం... ఎన్నికల ఫలితాలు విడుదలైన పదిరోజుల్లోపే వీవీ ప్యాట్ స్లిప్పులను కాల్చివేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యంపై అందరికీ నమ్మకం కలుగుతుందన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు పని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సమావేశంలో నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.

దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలి