
‘హోంవర్క్’ చేయలేదని.. పారిపోయిన విద్యార్థులు
● గంటలో పట్టుకున్న ధర్మవరం వన్‌టౌన్ పోలీసులు
ధర్మవరం అర్బన్: హోంవర్క్ చేయని తమను టీచర్ కొడుతుందన్న భయంతో ఇద్దరు విద్యార్థినులు స్కూల్ నుంచి పారిపోగా, పోలీసులు గంటలోనే వారి ఆచూకీ కనిపెట్టి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్‌లో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ధరణి, కృష్ణప్రియ ఆరో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ మంగళవారం హోంవర్క్ చేయలేదు. దీంతో టీచర్ కొడుతుందేమోనని భయపడి మధ్యాహ్నం స్కూల్ నుంచి పారిపోయారు. దీంతో స్కూల్ టీచర్లు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు వెంటనే వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ వెంటనే స్పందించి విద్యార్థినుల కోసం ముమ్మరంగా గాలించారు. రైలు ఎక్కి ఎటైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న విద్యార్థినులను పీఆర్‌టీవీధిలో గుర్తించారు. వారికి మంచిమాటలు చెప్పి స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థినులను అప్పగించారు.
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తి అర్బన్: అపరిష్కృతంగా ఉన్న అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా సమితి, ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఐసీడీఎస్ పీడీ ప్రమీలకు వినతి పత్రం అందజేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, యాప్‌ల భారం తగ్గించాలని, కొత్త ఫోన్లను ఇవ్వాలని, కక్ష సాధింపులు వీడాలని డిమాండ్ చేశారు. మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని కోరారు. డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షురాలు మాబున్నీషా నాయకులు పాల్గొన్నారు.