
కంటైనర్ మాటున చీకటి దందా
సాక్షి, పుట్టపర్తి: కంటైనర్ల మాటున గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో హిందూపురం నుంచి పశు మాంసం విచ్ఛలవిడిగా బెంగళూరుకు తరలిపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశుమాంస అక్రమ వ్యాపారం ఊపందుకుంది. హిందూపురం నుంచి రోజూ సగటున 20 టన్నుల పశుమాంసం తరలిస్తున్నట్లు సమాచారం. పాడి, పోషణ, వ్యాపారం పేరుతో గోరంట్ల, అనంతపురంలోని పశువుల సంతల నుంచి కొనుగోలు చేసిన గేదెలు, ఆవులు, ఎద్దులు, దున్నలను పగటి పూట నేరుగా హిందూపురం తరలిస్తారు. రాత్రి వేళల్లో వధించి.. తెల్లవారు లోపు ప్యాకింగ్ చేసి కంటైనర్లలో పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నారు.
అక్కడే ఎక్కువగా.. హిందూపురం పట్టణంలోని రహపుత్‌పురం, ఆజాద్ నగర్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆబాద్‌పేట, హస్నాబాద్, నింకంపల్లి తదితర ప్రాంతాల్లో పశు మాంస విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పగటి పూట కేవలం దున్నలు, ఎద్దుల మాంసం అందుబాటులో ఉంచుతారు. రాత్రి వేళల్లో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బెంగళూరుకు కిలో రూ.500 చొప్పున టన్నుల కొద్దీ తరలిస్తుంటారు. అంతేకాక పట్టణంలో సుమారు 20 షాపుల్లో పశుమాంసం విక్రయిస్తున్నారు. హిందూపురంలో 100కు పైగా వ్యాపారులు పశుమాంస విక్రయాల్లో భాగస్వాములుగా ఉన్నట్లు తెలిసింది.
నిబంధనలు బేఖాతరు మాంసం దుకాణాల్లో చాలా రోజులుగా నిల్వ ఉంచిన సరుకు ఉంటోందనే ఆరోపణలు ఉన్నాయి. పగటి పూట వధించిన పశువుల మాంసం మిగిలితే డ్రమ్ములు, ప్లాస్టిక్ సంచుల్లో నింపి రాత్రివేళల్లో కంటైనర్ల ద్వారా బెంగళూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ దందాలో టీడీపీకి చెందిన కొందరు ప్రముఖులకు ప్రతి నెలా పర్సెంటేజీల రూపంలో కమీషన్లు అందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పశుమాంస విక్రయదారులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
రాత్రి వేళల్లో విచ్ఛలవిడిగా పశుమాంసం రవాణా
గోరంట్ల, అనంతపురం సంతల్లో పశువుల కొనుగోళ్లు
హిందూపురంలో గుట్టు చప్పుడు కాకుండా వధ
డ్రమ్ములు, బాక్సుల్లో నింపి టన్నుల ప్రకారం తరలింపు
ఈ ఏడాది జూన్ 22న హిందూపురం నుంచి ఆరు వాహనాల్లో బెంగళూరుకు తరలిస్తున్న పశు మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశువుల మాంసాన్ని ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. ఎద్దులు, ఆవుదూడలు వధించిన మాంసమా? లేక దున్నల మాంసమా అనేది తేలిన తర్వాత కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ పరిస్థితి జిల్లా నుంచి పశుమాంసం అక్రమ రవాణాకు అద్దం పడుతోంది.