
నేత్రపర్వంగా శ్రీవారి ఉట్లోత్సవం
కదిరి టౌన్: భాద్రపద బహుళ అష్టమిని పురస్కరించుకుని ఖాద్రీ ఆలయ తూర్పు రాజగోపురం ఎదుట సోమవారం రాత్రి శ్రీవారి ఉట్లోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. కౌలేపల్లికి చెందిన గొల్ల సామాజిక వర్గానికి చెందిన యువకులు ఉట్ల మాను ఎక్కడానికి పోటీ పడ్డారు. అనంతరం ఉత్సవమూర్తునలు తిరు వీధుల్లో ఊరేగించారు.
సామూహిక సెలవులకు అనుమతివ్వండి
●ఎంపీడీఓకు పంచాయతీ
కార్యదర్శుల వినతి
ఎన్‌పీకుంట: సమస్యలు పరిష్కరించలేకపోతే సామూహిక సెలవులు మంజూరు చేయాలంటూ ఎంపీడీఓ పార్థసారథికి పంచాయతీ కార్యదర్శులు విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీఓను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ఏ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు లేని విధంగా తమపై పనిభారం పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పనివేళలు పాటించకుండా వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించడం, సెలవులు, పండుగలు, ఆదివారాల్లోనూ బలవంతంగా పనిచేయించడం దారుణమన్నారు. పనిభారంతో శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. స్వామిత్వ సర్వేలో సభ్యులందరూ హాజరుకాక పోవడంతో సర్వే ఆలస్యమవుతోందని, అయితే ఉన్నతాధికారులు మాత్రం సర్వే త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఒత్తిళ్లు పెంచుతున్నారని మండిపడ్డారు. అంతేకాక సచివాలయంలో రకరకాల సర్వేలు, ఆడిట్‌లు, ఇతర అంశాలపై ఒక పంచాయతీ కార్యదర్శి ఏకాగ్రత చూపలేక పోతున్నారన్నారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ చాలా క్లిష్టమైన పనిగా ఉందన్నారు. సమస్యలకు పరిష్కారం చూపాలని, అలా చేయడానికి అవకాశం లేకపోతే తమకు సామూహిక సెలవులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ మాధవరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా శ్రీవారి ఉట్లోత్సవం