
‘కూటమి’ చెరలో చిత్రావతి!
పుట్టపర్తి అర్బన్: రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరినప్పటి నుంచీ ఆ పార్టీల నేతలు సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో సులువుగా డబ్బు సంపాదించేందుకు సహజ వనరులను కొల్లగొడుతున్నారు. ఇందుకోసం చిత్రావతిని చెరబట్టి ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇరిగేషన్, మైనింగ్ అధికారులను భయపెట్టి జేసీబీల సాయంతో పట్టపగలే ఇసుకను తరలిస్తున్నారు. కర్ణాటకనాగేపల్లి బ్రిడ్జి దగ్గర నుంచి ఎస్సీ కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న చిత్రావతి నది నుంచి ఇసుకను తోడేస్తూ తరలిస్తున్నారు. కూటమి నేతల ధనదాహానికి చిత్రావతి రూపురేఖలే మారిపోయాయి. ఎక్కడ చూసినా పెద్దపెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. రేయింబవళ్లు వందల ట్రాక్టర్ల ఇసుకను చిత్రావతి నుంచి తరలించి ఓ చోట డంప్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో బెంగళూరుకు పంపి భారీగా సంపాదిస్తున్నారు. కూటమి నేతల ఇసుక దందాను ఇరిగేషన్ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా... మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వారిని మందలించినట్లు తెలుస్తోంది. చిత్రావతివైపు గానీ, ఇసుక అక్రమ రవాణా వైపు గానీ కన్నెత్తి చూడవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇరిగేషన్ అధికారులు మైన్స్ శాఖ అధికారులకు లేఖలు రాసి మిన్నకుండిపోయారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ చిత్రావతిలో చెక్ డ్యాం నిర్మాణం పేరుతో కేవలం ఇసుకను తరలించి రూ.వందల కోట్లు సంపాదించినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా కూడా డబ్బు కోసం అదే మార్గాన్ని అవలంబిస్తున్నారు.
నది నుంచి భారీగా
ఇసుక అక్రమ రవాణా
ప్రైవేటు స్థలంలో డంప్..
బెంగళూరుకు తరలింపు
ఇసుకాసురులకు
మాజీ మంత్రి ‘పల్లె’ అండ !

‘కూటమి’ చెరలో చిత్రావతి!