
‘పరిష్కార వేదిక’కు 232 అర్జీలు
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమానికి వివిధ సమస్యలపై ప్రజల నుంచి 232 అర్జీలు అందాయి. ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కారం కోసం వాటిని ఆయా శాఖలకు పంపారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చన్నారు. ప్రతి అర్జీపై పూర్తి స్థాయి విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్‌ఎల్‌ఎ, రీఓపెనింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, డీపీఓ సమతలతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లాకు 1,156
ఈ పాస్ మిషన్లు
పుట్టపర్తి అర్బన్: చౌక ధాన్యం పంపిణీలో భాగంగా జిల్లాకు 1,156 ఈ పాస్ మిషన్లు చేరాయని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వెల్లడించారు. గతంలో పంపిణీ చేసిన ఈ పాస్ మిషన్లు తరచూ సాంకేతిక సమస్యలతో మొరాయిస్తుండడంతో నూతన మిషన్లును అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
వృద్ధుడిని ఏమార్చి
నగదు అపహరణ
గోరంట్ల: వృద్ధుడిని ఏమార్చి అతని ఏటీఎం కార్డు ద్వారా నగదు అపహరించిన ఘటన గోరంట్లలో సోమవారం వెలుగు చూసింది. వివరాలు... పుట్టపర్తి మండలం పెడపల్లి తండాకు వృద్ధుడు గ్యాంగేనాయక్ సోమవారం రూ.10వేలు నగదు విత్ డ్రా చేసేందుకు గోరంట్లలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రానికి చేరుకున్నాడు. అయితే నగదు విత్ డ్రా విధానం తెలియక అక్కడే ఉన్న ఓ యువకుడి సాయం తీసుకున్నాడు. అతను ఏటీఎం నుంచి రూ.5వేలు డ్రా చేసి, అంతే మొత్తం మాత్రమే వస్తుందని నమ్మబలుకుతూ వృద్ధుడిని ఏమార్చి మరో ఏటీఎం కార్డు చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత ఏటీఎం ద్వారా రూ.35 వేలు డ్రా అయినట్లుగా ఫోన్‌కు మెసేజ్ అందడంతో వృద్ధుడి కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. చేతిలో ఉన్న ఏటీఎం కార్డును పరిశీలించగా అది తమది కాకపోవడంతో మోసపోయినట్లుగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.