
పరిమళించిన మానవత్వం
అనంతపురం సిటీ: ఓ వైపు అనారోగ్యం.. మరోవైపు ఆకలిబాధ తట్టుకోలేక ఫుట్‌పాత్‌పై వృద్ధుడు ఆర్తనాదాలు చేస్తున్నాడు. ఆ మార్గంలో ఎంతోమంది వెళ్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ నలుగురు విద్యార్థినులు స్పందించారు. దగ్గరకు వెళ్లి ఆయన బాధ కనుక్కొని అన్నం పెట్టి.. ఆపై ఆస్పత్రిలో చేర్చి మానవత్వం చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం పాముదుర్తికి చెందిన సత్యనారాయణ (70) షుగర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యుల నిరాదరణకు గురైన ఆయన అనంతపురం చేరాడు. జిల్లాపరిషత్ కార్యాలయం ఎదుట ఫుట్‌పాత్‌పై పడి ఉన్నాడు. నాలుగు రోజులుగా అన్నపానీయాలు లేక నీరసించిపోయాడు. శనివారం ఆకలికి తాళలేక గట్టిగా కేకలు వేస్తున్నాడు. అటుగా రాకపోకలు సాగిస్తున్నవారు చూస్తూ పోతున్నారే కానీ ఎవ్వరూ ఆయన బాధ ఏమిటో కనుక్కోలేకపోయారు. అదే సమయంలో కేఎస్‌ఆర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్న త్రివేణి, కళ్యాణి, శిరీష, లల్లీశ్రీ ఆ వృద్ధుడి దీనస్థితి చూసి చలించిపోయారు. అయ్యో పాపం.. అంటూ దగ్గరకు వెళ్లగానే దుర్వాసన వచ్చింది. కాలు కుళ్లిపోయి.. పురుగులు పట్టి కదలలేని స్థితిలో ఉన్న అతడిని ‘ఏమైంది తాతా’ అంటూ ఆరా తీశారు. అతను కడుపు పట్టుకుని ఆకలి అవుతున్నట్లు తెలిపాడు. ఆ విద్యార్థినులు తమ వద్ద ఉన్న చిల్లర డబ్బు పోగు చేసుకుని హోటల్‌నుంచి భోజనం తీసుకొచ్చి తినిపించారు. ఆ తర్వాత ఆటోను పిలిచి వృద్ధుడిని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. సంతకాలు పెడితేనే అడ్మిషన్ చేసుకుంటామని చెప్పడంతో విద్యార్థినులు నేరుగా ఆర్‌ఎంఓ డాక్టర్ గుజ్జల హేమలతను కలిసి విషయం తెలిపారు. ఆమె ఆలస్యం చేయకుండా విద్యార్థినులకు ధైర్యం చెప్పి.. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) డాక్టర్ కార్తీక్‌రెడ్డి, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మలాదేవిని వెంటబెట్టుకొని క్యాజువాలిటీకి చేరుకున్నారు. దుర్వాసన వస్తున్న వృద్ధుడికి సిబ్బంది చేత స్నానం చేయించిన తర్వాత అన్ని రకాల పరీక్షలు చేయించారు. కుళ్లిపోయిన కాలును తొలగించాలని, లేకుంటే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు తేల్చారు. అడ్మిషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు. మానవత్వంతో స్పందించిన విద్యార్థినులు త్రివేణి, కళ్యాణి, శిరీష, లల్లీశ్రీని ఆర్‌ఎంఓ, సీఎంఓ ప్రశంసించారు. విద్యార్థి లోకానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
ఫుట్‌పాత్‌పై వృద్ధుడి నరకయాతన
ఆకలి తీర్చి.. ఆటోలో ఆస్పత్రికి చేర్చి
ఆదర్శంగా నిలిచిన ఇంటర్ విద్యార్థినులు