
థియేటర్‌లో చోరీ
కొత్తచెరువు: మండల కేంద్రం కొత్తచెరువులోని పుట్టపర్తి రోడ్డులో గల సందీప్ థియేటర్‌లో శనివారం తెల్లవారుజామున రూ.ర51 వేల నగదు చోరీ జరిగినట్లు థియేటర్ మేనేజర్ పెద్దిరెడ్డిగారి నరసింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన సీఐ మారుతీప్రసాద్ సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నగదు చోరీ చేసినది లక్ష్మి థియేటర్ వాచ్‌మెన్ బి.ధనుష్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి నగదు రికవరీ చేసి, రాడ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
మాజీ మంత్రి శైలజానాథ్‌కు అస్వస్థత
శింగనమల: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో ఇబ్బంది పడుతున్నా ఈ నెల 9న అనంతపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ‘అన్నదాత పోరు’లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం హైదరాబాద్‌లోని సొంతింటికి వెళ్లారు. ఉన్నట్టుండి శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. శైలజానాథ్ త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు కోరుకుంటున్నారు.
జంట హత్యల కేసులో
మరొకరికి రిమాండ్
రాప్తాడు: గంగలకుంట గ్రామ పొలంలో జరిగిన జంట హత్య కేసులో పది మంది నిందితుల అరెస్ట్ తర్వాత తాజాగా శనివారం మరొక నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ప్రత్యేక విచారణ అధికారి, అనంతపురం నాల్గో పట్టణ సీఐ జగదీష్ శనివారం వెల్లడించారు. ఈ ఏడాది మే 17న గంగలకుంట గ్రామ పొలంలో గొల్లపల్లికి చెందిన రైతు చిగిచెర్ల నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతులపై టీడీపీ కార్యకర్తలు వేట కొడవళ్లు, కట్టెలతో దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష సాక్షి మృతుడు నారాయణరెడ్డి కుమారుడు చిగిచెర్ల ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రాప్తాడు పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు. మే 19న ఆరుగురు నిందితులను రిమాండ్‌కు పంపారు. అదే నెల 21న మరొక నిందితుడు కోర్టులో లోంగిపోయాడు. అదే నెల 23న ఇంకొక నిందితుడిని, ఈ నెల 12న మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అజ్ఞాతంలో ఉన్న చివరి నిందితుడు గొల్లపల్లి పెద్దింటి జగదీష్ శనివారం హంపాపురం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై తచ్చాడుతూ కనిపించగా.. పోలీసులు అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. హత్య జరిగి 120 రోజుల తర్వాత మొత్తం 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులోని 8 మంది నిందితులు 3 నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.
లాటరీ, సారా విక్రేతల అరెస్ట్
కదిరి టౌన్: లాటరీలు, సారాయి విక్రయిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని డీఎస్పీకి అందిన సమాచారం మేరకు.. పట్టణ ఎస్‌ఐ బాబ్జాన్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం సాయంత్రం కుటాగుళ్ల రైల్వే గేటు సమీపంలో దాడులు నిర్వహించారు. ఐదుగురిని అరెస్ట్ చేసి.. వారి నుంచి 16 లీటర్ల నాటుసారా, 47 లాటరీ టికెట్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. నిందితులను రిమాండ్ నిమిత్తం సబ్‌జైలుకు పంపించామన్నారు. మరో ఆరుగురు వ్యక్తులు తప్పించుకుని పారిపోయారన్నారు.
సంగారెడ్డి భక్తుల కళా వైభవం
ప్రశాంతి నిలయం: సంగారెడ్డి జిల్లా సత్యసాయి భక్తుల కళా వైభవం పరవశింపజేసింది. పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన సంగారెడ్డి జిల్లా సత్యసాయి భక్తులు శనివారం ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి స్త్రోత్రాన్ని పఠించారు. సాయంత్రం సత్యసాయి యూత్, బాలవికాస్ విద్యార్థులు ‘బాలకాండలో సంస్కరణల పర్వం’ పేరుతో సంగీత నృత్యరూపకం నిర్వహించారు. సత్యసాయి బాల్యదశ, ఆయన సేవా స్పూర్తి, ప్రేమ తత్వాన్ని వివరిస్తూ సాగిన సంగీత నృత్యరూపకం ఆకట్టుకుంది.

థియేటర్‌లో చోరీ