
నవంబర్ 7 నుంచి రెవెన్యూ క్రీడలు
అనంతపురం అర్బన్: అనంతపుం వేదికగా రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలు నంబరు 7 నుంచి మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. అనంతపురం విచ్చేసిన ఆయన శనివారం రెవెన్యూ హోమ్‌లో డీఆర్‌ఓ మలోల, రెవెన్యూ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ రాజేష్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు దివాకర్‌రావు, మైనుద్దీన్, మహిళా విభాగం అధ్యక్షురాలు సురేఖరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్ల సహకారంతో క్రీడలను ఉత్సాహంగా ఉల్లాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు. పనిఒత్తిడిలో ఉండే రెవెన్యూ ఉద్యోగులకు ఈ క్రీడా ఉత్సవాలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. తొలిరోజు 7న కార్యక్రమాన్ని సీసీఎల్‌ఏ ప్రారంభిస్తారన్నారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరవుతారని పేర్కొన్నారు. ఇక ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఇప్పటికే అందరినీ కలిసి ఆహ్వానించామన్నారు. హోదా తారతమ్యం లేకుండా క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల్లో రెవెన్యూ ఉద్యోగులు వీఆర్‌ఏ మొదలు డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు అందరూ పాల్గొంటారన్నారు. జిల్లా ఒక యూనిట్‌గా 26 జిల్లా యూనిట్లు, సీసీఎల్‌ఏ యూనిట్ మొత్తం 27 యూనిట్ల నుంచి దాదాపు 2 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని వెల్లడించారు. క్రీడా కార్యక్రమాల్లో ఐఏఎస్ అధికారులందరూ పాల్గొంటారన్నారు. రెవెన్యూ క్రీడలు నిర్వహించేందుకు సహకారం అందిస్తున్న ప్రభుత్వానికి, ఆర్డీటీ యాజమాన్యానికి రెవెన్యూ ఉద్యోగుల సంఘం తరఫున ధన్యావాదాలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల షెడ్యూల్‌ను నాయకులు విడుదల చేశారు.
హాజరు కానున్న 2 వేల మంది ఉద్యోగులు
రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు