
జిల్లా కోర్టు భవనాలకు స్థల పరిశీలన
పుట్టపర్తి అర్బన్: జిల్లా కేంద్రం పుట్టపర్తిలో జిల్లా కోర్టు భవనాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని హైకోర్టు జడ్జి రామకృష్ణ ప్రసాద్, జేసీ అభిషేక్‌కుమార్ పరిశీలించారు. జిల్లా కోర్టు భవనాల నిర్మాణాలకు కనీసం పది ఎకరాలు అవసరం కానుండగా, శనివారం హైకోర్టు జడ్జి, జేసీ అధికారులతో కలిసి పుట్టపర్తి సమీపంలోని మామిళ్లకుంట క్రాస్‌లో ఉన్న భూములను పరిశీలించారు. కొత్తచెరువు–పుట్టపర్తి ప్రధాన రహదారి సమీపంలోని పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న భూమిని పరిశీలించారు. అలాగే మరో ప్రాంతంలోని భూములను సైతం పరిశీలించారు. జిల్లా ప్రజలకు అనుకూలంగా అన్ని కోర్టులు ఒకే ప్రాంతంలో ఉండేవిధంగా సౌకర్యవంతంగా జిల్లా కోర్టు భవనాలు నిర్మించనున్నట్లు హైకోర్టు జడ్జి రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. అధికారుల వెంట ఆర్డీఓ సువర్ణ, హిందూపురం సీనియర్ సివిల్ జడ్జి శైలజ, పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ముజీబ్, తహసీల్దార్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు.
సత్యసాయి సేవలో హైకోర్టు జడ్జి
ప్రశాంతి నిలయం: హైకోర్టు జడ్జి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ శనివారం సత్యసాయి సేవలో గడిపారు. శనివారం రోడ్డుమార్గాన పుట్టపర్తికి చేరుకున్న ఆయనకు ప్రశాంతి నిలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, హిందూపురం సీనియర్ సివిల్ జడ్జి శైలజ, పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ముజీబ్‌లు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో జడ్జి రామకృష్ణ ప్రసాద్ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
టీడీపీ నేతకు దేహశుద్ధి
● మహిళను వేధించిన ఫలితం
● కారులోంచి లాక్కెళ్లి చితకబాదిన వైనం
గోరంట్ల: ‘వెలుగు’లో పని చేస్తున్న ఓ మహిళను వేధింపులకు గురిచేసిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ను సదరు మహిళ బంధువులు దేహశుద్ధి చేశారు. రెండురోజుల క్రితం జరిగిన ఈ ఘటన శనివారం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మల్లాపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ‘వెలుగు’లో పనిచేస్తోంది. సదరు మహిళపై కన్నేసిన ఓ టీడీపీ ముఖ్యనాయకుడు తరచూ ఆమెకు ఫోన్ చేసి వేధింపులకు గురిచేసేవాడు. రానురాను వేధింపులు తీవ్రతరం కావడంతో బాధిత మహిళ విషయం భర్తకు తెలిపింది. దీంతో సదరు నాయకుడికి బుద్ధి చెప్పాలనుకున్న మహిళ భర్త తన బంధువులు, మిత్రులతో కలిసి రెండురోజుల క్రితం రాత్రి వేళ పట్టణంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద కాపు కాశాడు. ఆ సమయంలో కారులో అక్కడికి వచ్చిన టీడీపీ నాయకుడిని కారులోంచి లాక్కుని వెళ్లి చితకబాదారు. సదరు మహిళ భర్త కూడా టీడీపీ నాయకుడే కావడంతో ఆ పార్టీలోని కొందరు పెద్దలు విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ శనివారం ఈ విషయం బయటకు రాగా..ఎవరా నాయకుడంటూ అందరూ ఆరా తీయడం ప్రారంభించారు. అయినా మహిళను వేధించిన ఆ నాయకుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.
జాతీయ లోక్ అదాలత్‌లో 6,542 కేసుల పరిష్కారం
అనంతపురం: ‘కోర్టు కేసుల్లో ఎవరో ఒకరే గెలుస్తారు. మరొకరు పరాజితులు అవుతారు. కానీ జాతీయ లోక్ అదాలత్‌లో లభించే పరిష్కారంలో ఇరువురూ విజేతలే’ అని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమారావు అన్నారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో మొత్తం 6,542 కేసులు పరిష్కారమయ్యాయి. 32 మోటార్ వాహన ప్రమాద కేసుల్లో రూ.1.26 కోట్లు, సివిల్ దావాల్లో రూ.84 లక్షలు, 2,351 ప్రీ లిటిగేషన్ కేసుల్లో రూ.1.04 కోట్లు, ఎన్‌ఐ యాక్ట్ కేసుల్లో రూ. 1.18 కోట్లు బాధితులకు నష్ట పరిహారం అందించారు. జాతీయ లోక్‌అదాలత్‌కు హాజరైన కక్షిదారులకు ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి సి.సత్యవాణి, అనంతపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కోర్టు భవనాలకు స్థల పరిశీలన