
జిల్లా నూతన ఎస్పీగా సతీష్‌కుమార్
పుట్టపర్తి టౌన్: జిల్లా నూతన ఎస్పీగా సతీష్‌కుమార్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎస్పీలను బదిలీ చేసిన ప్రభుత్వం... గుంటూరు (అర్బన్) ఎస్పీగా పనిచేస్తున్న సతీష్ కుమార్‌ను జిల్లాకు బదిలీ చేసింది. ఇక్కడ ఎస్పీగా ఉన్న వి.రత్నకు మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
వ్యవసాయ కుటుంబంలో పుట్టి..
జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన సతీష్‌కుమార్ స్వస్థలం తమిళనాడు. ఆయన 2016 ఐపీఎస్ బ్యాచ్. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన.. బీటెక్ బయోటెక్నాలజీ చదివారు. అనంతరం తమిళనాడు గ్రూప్–2 పోస్టు సాధించి ట్రెజరీ డిపార్టుమెంట్‌లో రెండున్నర ఏళ్లు పనిచేశారు. ఆ తర్వాత యూపీఎస్సీపై గురిపెట్టారు. నాలుగుసార్లు విఫలమైనా పట్టుదలతో చదివారు. ఐదో ప్రయత్నంలో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం చింతలపల్లి అదనపు ఎస్పీగా, నర్సీపట్నంలో ఓఎస్డీగా, అల్లూరి సీతారామరాజు, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. సతీష్‌కుమార్ ఎక్కడ పనిచేసినా యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. తరచూ కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు సైబర్ నేరాల గురించి తెలియజెప్పేవారు. అర్ధరాత్రి సమయాల్లో పట్టణంలో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకునే వారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించేవారు. స్నేహపూర్వక పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌లో మంచిపేరు సంపాదించారు. గుంటూరు ఎస్పీగా నేరాలు నియంత్రించడంలో వ్యూహాత్మంగా పనిచేశారు. అందుకే సతీష్‌కుమార్‌కు అటు పోలీసులు, ఇటు ప్రజల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆదివారమే ఆయన జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
వి.రత్నకు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం