
కనిపించని ప్రత్యామ్నాయం
పుట్టపర్తి అర్బన్: కీలకమైన జూలై వర్షాలు ఖరీఫ్‌ను దారుణంగా దెబ్బతీశాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో లక్షలాది ఎకరాల్లో పంటలు సాగు చేయలేక రైతులు చేతులెత్తేశారు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగే శరణ్యంగా మారింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో వేరుశనగ పూర్తిగా సాగులోకి రాకపోవడంతో రాబోవు వేసవిలో పశువులకు మేత దొరకడం కష్టమవుతుంది. దీంతో కనీసం ప్రత్యామ్నాయ పంటలు ఆదుకుంటాయని రైతులు భావిస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ విత్తన పంపిణీపై ఇప్పటి వరకూ కూటమి సర్కారు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు మండిపడుతున్నారు.
జిల్లాలో 2,69,152 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలో జిల్లాలోకి ప్రవేశించినా ఆశించిన మేర వర్షాలు కురవలేదు. దీంతో కేవలం 35 వేల హెక్టార్లలో వేరుశనగ, 15 వేల హెక్టార్లలో కంది, 17 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 5 వేల హెక్టార్ల వరి, మరో 75 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. ఇప్పటికీ సుమారు 2 లక్షల హెక్టార్ల భూమి బీడుగానే ఉంది. ఆగస్టులో అంచనాకు మించి వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ఈ నెలలోనూ అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో భూములు బీడుగా ఉంచడం కంటే ప్రత్యామ్నాయ పంటలైన ఉలవ, పెసర, అలసంద, జొన్న సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ పంటల ద్వారా కనీసం పశువులకు మేతైనా దక్కుతుందని ఆశిస్తున్నారు.
జిల్లాలో 64 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలుకావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా వ్యవసాయాధికారి రాము నాయక్ తెలిపారు. ఇందులో 55 వేల హెక్టార్లలో ఉలవ సాగుకు 13,750 క్వింటాళ్ల విత్తనాలు, 3 వేల హెక్టార్లలో పెసర సాగుకు 600 క్వింటాళ్ల విత్తనాలు, 4 వేల హెక్టార్లలో అలసంద సాగుకు 800 కిలోల విత్తనాలు, 2 వేల హెక్టార్లలో జొన్న సాగుకు 200 కిలోల విత్తనాలకు ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. అయితే ప్రత్యామ్నాయ విత్తన పంపిణీపై ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వకపోవడంతో అధికారులు సైతం వేచి చూడక తప్పడం లేదు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమానికి సీఎం చంద్రబాబు తిలోదకాలిచ్చేశారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అధికారం చేపట్టి 15 నెలలు గడిచినా వ్యవసాయం, రైతు సంక్షేమం గురించి ఇప్పటి వరకూ పట్టించుకోకపోవడంతో అన్నదాతల్లో అసహనం వ్యక్తమవుతోంది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వలేదు, పంటల బీమా కింద పరిహారం ఇవ్వలేదు. కొత్తగా పంటల బీమా పథకాల గురించి ఊసేలేదు. ప్రత్యామ్నాయం కింద విత్తనాలకు అతీగతీ లేకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీజన్‌కు ముందే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా పెట్టుబడి సాయాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తూ వచ్చారని, ఉచిత పంటల బీమా పథకంతో తమకు అండగా నిలిచారంటూ నాటి వైఎస్ జగన్ పాలనను అనుక్షణం రైతులు గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. చంద్రబాబు సర్కార్ తీరుతో వ్యవసాయానికి గడ్డు కాలం దాపురిస్తోందని మండిపడుతున్నారు.
75 వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగు
64 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయానికి ప్రతిపాదనలు
వర్షాలు కురుస్తున్నా
విత్తన పంపిణీ ఊసెత్తని ప్రభుత్వం
కూటమి సర్కారు తీరుపై
రైతుల మండిపాటు
రైతు సంక్షేమానికి తిలోదకాలు..
ప్రత్యామ్నామయే దిక్కు..
64వేల హెక్టార్లకు ప్రతిపాదనలు..