
యువకుడి దుర్మరణం
తనకల్లు: మండల పరిధిలోని 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ముదిగుబ్బ మండలం దొరిగల్లుకు చెందిన ఓం ప్రతాప్ (30) సొంతంగా బొలెరో పికప్ వాహనాన్ని ఏర్పాటు చేసుకుని సొంతంగా డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వివాహమైంది కానీ పిల్లలు లేరు. శుక్రవారం టమాట లోడ్ చేసుకుని పుంగనూరు సమీపంలోని వడ్డిపల్లికి రైతు ప్రసాద్‌తో కలసి వెళ్లాడు. అక్కడ అన్‌లోడ్ అనంతరం స్వగ్రామానికి బయలుదేరారు. తనకల్లు మండలం మండ్లిపల్లి మలుపు వద్దకు రాగానే 42వ జాతీయ రహదారిపై కదిరి నుంచి మదనపల్లి వైపు వెళుతున్న లారీని వేగంగా ఢీకొనడంతో బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాలతో ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంలోనే ఇరుక్కుపోయిన మృతదేహాన్ని అతి కష్టంపై స్థానికులు వెలికి తీశారు. తీవ్ర గాయాలమైన రైతు ప్రసాద్‌ను వందేమాతరం టీం సభ్యులు తమ ఉచిత అంబులెన్స్‌లో తొలుత తనకల్లులోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.
గిరిజన యువతి అదృశ్యం
కదిరి టౌన్: గిరిజన యువతి మిస్సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. స్థానిక శివాలయం వీధిలో నివాసముంటున్న గిరిజన వ్యక్తి తన అక్క కుమార్తెను చేరదీసి ఆమె పోషణ భారాన్ని తీసుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో తల్లి వంట చేస్తుండగా ఇంట్లో చెత్త బయట పడేసి వస్తానని వెళ్లిన యువతి.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు మేనమామ ఫిర్యాదు చేశాడు. కాగా, తన మేనకోడలితో కదిరి రూరల్ మండలం దిగువపల్లికి చెందిన మహేష్‌నాయుడు చనువుగా ఉండేవాడని, ఈ పరిస్థితుల్లో మహేష్‌నాయుడిపైనే తమకు అనుమానం ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
చిన్నారిని బలిగొన్న బాటిల్ మూత
గుత్తి రూరల్: వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని రక్షత్‌రామ్ (18 నెలలు) అనే చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన గుత్తి మండలం వన్నేదొడ్డి గ్రామ శివారులోని పవర్‌గ్రిడ్ కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం నగరానికి చెందిన మౌనిక పవర్‌గ్రిడ్ కేంద్రంలో ఏపీ ట్రాన్స్‌కో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం రాత్రి నైట్ షిఫ్ట్ డ్యూటీకి కుమారుడు రక్షత్‌రామ్‌ను తీసుకుని వెళ్లారు. కుమారుడు ఆడుకోవడానికి వాటర్ బాటిల్ ఇచ్చి విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో బాటిల్ మూత తీసి మింగడానికి ప్రయత్నించడంతో గొంతులో ఇరుక్కుని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన ఏడీఈ, పవర్‌గ్రిడ్ ఉద్యోగులు వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుమారుడి మృతితో తల్లి మౌనిక కన్నీరుమున్నీరుగా విలపించారు.

యువకుడి దుర్మరణం

యువకుడి దుర్మరణం