
భర్త చేతిలో గాయపడి వివాహిత మృతి
పెనుకొండ: భర్త చేతిలో గాయపడి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వివాహిత శుక్రవారం మృతిచెందింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. పెనుకొండలోని కుమ్మరిదొడ్డిలో నివాసముంటున్న షాను కుమార్తె సుమియా బేగంకు స్థానిక విశ్రాంత ఆర్‌ఐ ఫజులుల్లాఖాన్ కుమారుడు అల్తాఫ్ ఖాన్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల వయసున్న కుమారుడు, రెండేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా రెండేళ్ల క్రితం పిల్లలను పిలుచుకుని సుమియా తన పుట్టింటికి చేరుకుంది. అప్పటి నుంచి ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. 20 రోజుల క్రితం అల్తాఫ్‌ఖాన్ స్కూల్ వద్దకెళ్లి కుమార్తె జైనాబీని పిలుచుకెళ్లాడు.
విషయం తెలుసుకున్న సుమియా బేగం వెంటనే దర్గా సర్కిల్‌లో నివాసముంటున్న భర్త గదికి వెళ్లి కుమార్తెను తన వెంట పంపాలని వేడుకుంది. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన అల్తాఫ్‌ఖాన్ విచక్షణ కోల్పోయి దాడి చేయడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆమెను బెంగళూరులోని ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకున్న అనంతరం ఇద్దరినీ రాజీ చేసి కలపాలని ఇరువైపులా కుటుంబసభ్యులు భావించారు. అయితే బెంగళూరులో చికిత్స పొందుతున్న సుమియా పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందింది. తల్లి అకాల మరణంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. మృతురాలి తల్లి షాను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.