
17 నుంచి మహిళా ఆరోగ్య కార్యక్రమాలు
పుట్టపర్తి అర్బన్: మహిళలకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన చికిత్స పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం తెలిపారు. ఈ నెల 17న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆయుస్మాన్ మందిరాలు, ప్రాధమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెల్త్ కియోస్కీల ఏర్పాటు, ప్రసూతి, చిన్న పిల్లల, కంటి, ఈఎన్‌టీ, దంత, చర్మ, సైకియాట్రీ సేవలు, మహిళలకు హిమోగ్లోబిన్, బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీకు స్క్రీనింగ్ చేయనున్నట్లు వివరించారు. చిన్నారులకు టీకాలు కూడా వేస్తారన్నారు.న రక్తదాన శిబిరాల ఏర్పాటు, పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన సదస్సులు ఉంటాయన్నారు. ఆయుస్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన కార్డులు, 70 ఏళ్లు దాటిన వారికి వయోవందన కార్డులు జారీకి వివరాలు నమోదు చేస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.