
పెడపల్లి వద్ద రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న
రోజుల వ్యవధిలో దిగజారుతున్న వేరుశనగ, మొక్కజొన్న ధరలు
గిట్టుబాటు కావడం లేదంటున్న రైతులు
దిగుబడులు బాగా ఉన్నా మార్కెట్‌లో సరైన ధరలు లేకపోవడంతో వేరుశనగ, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజుల వ్యవధిలోనే ధరలు పతనమవుతుండడంతో అయోమయంలో పడ్డారు.
పుట్టపర్తి అర్బన్: ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నష్టాలు మిగులుతున్నాయని జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి రాకముందు ఉన్న ధరలు దిగుబడి వచ్చిన తర్వాత గణణీయంగా తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతుల పంటలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తూ వచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సేవా కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవడంతో దళారుల చెప్పిందే వేదంగా మారింది. జిల్లాలో వ్యవసాయ బోరు బావులు ఉన్న రైతులు మొక్కజొన్న, వేరుశనగ పంటలను సాగు చేశారు. ఖరీఫ్‌లో వచ్చే ఆదాయాలపైనే కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, గృహ నిర్మాణాలు వంటి వాటిపైనే రైతులు ఆధారపడి ఉంటారు. ఇలాంటి తరుణంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాలు చవిచూడక తప్పడం లేదు.
పంట చేతికి రాగానే ధర పతనం..
ఏటా పంట విక్రయాల్లో రైతులు దగా పడుతూనే ఉన్నారు. పంట చేతికి రాకముందు ఉన్న ధరలు.. పంట చేతికి వచ్చిన సమయానికి పూర్తిగా పడిపోతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 45 కిలోల వేరుశనగ బస్తా రూ.3600తో అమ్ముడు పోయింది. మొక్కజొన్న క్వింటా రూ.3,800 వరకూ వ్యాపారులు కొనుగోలు చేశారు. గత నెలలో వేరుశనగ రూ.3,200, మొక్కజొన్న రూ.2,600తో వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం వేరుశనగ 45 కిలోల బస్తాను రూ.2,400 నుంచి రూ.3 వేలు, మొక్కజొన్న క్వింటా రూ.2 వేలతో కొనుగోలు చేస్తామంటూ వ్యాపారులు పేర్కొంటున్నారు. కే6 కాకుండా ఇతర నూతన రకం వేరుశనగను రూ.2 వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. వేరుశనగ సాగుకు ఎకరానికి రూ.40 వేలకు పైగా, మొక్కజొన్న సాగుకు రూ.25 వేలకు పైగా ఖర్చు వస్తోందని, ఈ నేపథ్యంలో వ్యాపారులు అడిగిన ధరతో పంటను విక్రయిస్తే తమకు ఎంత మాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. రోజుల వ్యవధిలోనే ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వేలాది మంది రైతులు మొక్కజొన్న, వేరుశనగ పంటలను తొలగించలేదు. పంటలన్నీ పూర్తయ్యే సమయానికి ఎంత మేర ధరలు పతనమవుతాయోనని ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వమే గిట్టుబాటు ధరతో పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
15 రోజుల్లోనే రూ.600 తగ్గింది
మొక్కజొన్న కోతలు మొదలు పెట్టే సమయంలో ఉన్న ధర కోత కాగానే లేకుండా పోయింది. 15 రోజుల వ్యవధిలోనే క్వింటా ధరలో రూ.600కు పైగా తగ్గింది. ప్రస్తుతం రూ.2 వేలకు కూడా కొనుగోలు చేయలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రబీలో పంటలు సాగు చేయడం కష్టం. – నాగభూషణ, రైతు, పెడపల్లి
గిట్టుబాటు ధర కల్పించాలి
గత ఏడాది వేరుశనగ బస్తా రూ.3,800తో అమ్మాను. ప్రస్తుతం బస్తా రూ. 3 వేల లోపు అడుగుతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పంటను కొనుగోలు చేస్తే వ్యాపారుల ఆటలు సాగవు. ఖరీఫ్, రబీ కాలానికి ముందే గిట్టుబాటు ధరలు ప్రకటించాలి.
– నరసింహారెడ్డి, రైతు, వెంకటగారిపల్లి

పుట్టపర్తి వద్ద అమ్మకానికి సిద్దంగా ఉన్న వేరుశనగ