
జాతీయ స్థాయి వర్సిటీ పోటీల్లో సత్తా చాటాలి
అనంతపురం: దక్షిణ భారతదేశ అంతర వర్సిటీ, జాతీయ స్థాయి పోటీల్లో జేఎన్‌టీయూ(ఏ) విద్యార్థులు సత్తా చాటాలని ఆ వర్సిటీ వీసీ హెచ్.సుదర్శనరావు పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూ (ఏ)లో గురువారం నిర్వహించిన 16వ స్పోర్ట్స్ కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి, మాట్లాడారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ క్రీడలను నిర్వహించే కాలేజీలను ,క్రీడాభివృద్ధికి సంబంధించిన అంశాలను స్పోర్ట్స్ కౌన్సిల్‌కు వివరించారు. జాతీయ, దక్షిణ భారత అంతర వర్సిటీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు వర్సిటీ తరపున తగిన ఆర్థిక చేయూతనందిస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య, డీఏపీ ఎస్వీ సత్యనారాయణ, డీఈ వి.నాగప్రసాదనాయుడు, ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్ సుబ్బారెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి, పులివెందుల కళాశాల ప్రిన్సిపాల్ డి. విష్ణువర్ధన్, ఫిజికల్ డైరెక్టర్ బి.జోజిరెడ్డి, జేఎన్‌టీయూ స్పోర్ట్స్ సెక్రెటరీ డాక్టర్ టి.నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పంట మార్పిడితో
మెరుగైన ఫలితాలు
పుట్టపర్తి అర్బన్: పంట మార్పిడితో మెరుగైన ఫలితాలు ఉంటాయని, జిల్లాలో బోరు బావుల కింద పంటలు సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలంటూ ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రామసుబ్బయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేరుశనగ సాగు చేసిన పొలంలో మొక్కజొన్న, మొక్కజొన్న సాగు చేసిన పొలంలో వేరుశనగ పంటలను సాగు చేయాలని సూచించారు. వరి సాగు చేసే నేలలో తరచూ అదే పంటను సాగు చేయకుండా పెసర, మినుము సాగు చేయాలన్నారు. ఇలా చేయడం వల్ల భూసారం పెరిగి మంచి దిగుబడులు సాధించవచ్చునని పేర్కొన్నారు. సాగు ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు.
14న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
కదిరి అర్బన్: ఈ నెల 22 నుంచి నాలుగు రోజుల పాటు విజయవాడ వేదికగా జరిగే 51వ జూనియర్ బాలబాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే జిల్లా జట్లను ఈ నెల 14న కదిరిలోని ఎస్టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు వెంకటరమణ, సుహాసిని, హరీష్‌కుమార్ తెలిపారు. 20 ఏళ్ల లోపు వయసున్న బాలబాలికలు అర్హులు. బాలురు 75 కేజీలు, బాలికలు 65 కేజీలలోపు ఉండాలి. పూర్తి వివరాలకు 88862 30013లో సంప్రదించవచ్చు.