
పట్టు ‘ప్రోత్సాహకం’ ఇవ్వండి
మడకశిర: బైవోల్టిన్ పట్టు సాగు చేసిన రైతులకు ప్రోత్సాహక ధనాన్ని వెంటనే మంజూరు చేయాలని సెంట్రల్ సిల్క్ బోర్డు జాయింట్ సెక్రటరీ నరేష్‌బాబును పలువురు రైతులు డిమాండ్ చేశారు. సెరికల్చర్ టెక్నాలజీ బదిలీ ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధ్యక్షతన గురువారం మడకశిరలోని యాదవ కల్యాణమంటపంలో ఏర్పాటు చేసిన ‘మేరా రేషం–మేరా అభిమాన్’ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యక్రమంలో నరేష్‌బాబు మాట్లాడుతూ... పట్టు పరిశ్రమలో ఆధునాతన సాంకేతిక పద్ధతుల ద్వారా ఉత్పత్తులను పెంచే అంశంపై పట్టు రైతులకు అవగాహన కల్పించారు. దేశ వ్యాప్తంగా కేంద్ర పట్టు మండలికి కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.4వేల కోట్లు కేటాయిస్తోందని, ఈ కేటాయింపును రూ.7,500 కోట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టు రైతు సంఘం జిల్లా నాయకులు ధనాపురం వెంకట్రామిరెడ్డి, సిద్ధారెడ్డి, రామకృష్ణారెడ్డి, సోమ్‌కుమార్, శంకర్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. బైవోల్టిన్ రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహక ధనం ఇంత వరకూ అందించ లేదని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించాల్సిన ప్రోత్సాహక ధనం బకాయిలు రూ.70 కోట్ల వరకు ఉన్నాయన్నారు. తక్షణమే ప్రోత్సాహక ధనాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. రేషం షెడ్లపై సబ్సిడీని రూ.10లక్షల వరకు పెంచాలని కోరారు. హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ భవన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. అనంతరం వివిధ జిల్లాలకు చెందిన 30 మంది ఆదర్శ పట్టు రైతులు, రీలర్లను సన్మానించారు. సమావేశంలో రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, అడిషనల్ డైరెక్టర్ అరుణకుమారి, జిల్లా అధికారి శోభారాణి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, స్థానిక ఏడీఏ హనుమంతనాయక్, కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, జిల్లాలోని పట్టు రైతులు పాల్గొన్నారు.
సెంట్రల్ సిల్క్ బోర్డు జాయింట్ సెక్రటరీ నరేష్‌బాబును డిమాండ్ చేసిన పట్టు రైతులు