ఉపాధ్యాయుల ‘పోరుబాట’ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల ‘పోరుబాట’

Sep 12 2025 6:05 AM | Updated on Sep 12 2025 6:05 AM

ఉపాధ్

ఉపాధ్యాయుల ‘పోరుబాట’

కదిరి: ‘అధికారం ఇచ్చి చూడండి. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ ఇస్తాం. పెండింగ్‌ బకాయిలన్నింటినీ ఒకేసారి ఇచ్చేస్తాం. సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. ఉద్యోగులకు పని భారం తగ్గిస్తాం’ అంటూ ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఉద్యోగ, ఉపాధ్యాయులపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. దీంతో ఉపాధ్యాయ సంఘాలన్నీ కూటమి సర్కారుపై గుర్రుగా ఉన్నాయి. ఓపిక నశించడంతో ఉద్యమాలకు సిద్ధమయ్యాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్‌) రణభేరి ప్రకటించింది. ఈ నెల 15 నుంచి 19 వరకూ ఉపాధ్యాయులు ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు బృందాలుగా పర్యటించనున్నారు. అప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకపోతే ఈ నెల 25న విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

టీచర్లకే పరీక్ష..

కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరిట విద్యారంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. విద్యాశాఖామంత్రి లోకేష్‌కు విద్యారంగంపై ఏమాత్రం అవగాహన లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల అభ్యసన మదింపు కోసం పెట్టే పరీక్షల మూల్యాంకణం ఇప్పుడు టీచర్లకే పరీక్షగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే యోగాంధ్ర, మెగా పేరెంట్‌ .. టీచర్స్‌ మీటింగ్‌లతో పాటు వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయమని టీచర్లపై ప్రభుత్వం పెట్టిన ఒత్తిడి అంతా ఇంతా కాదు. ప్రధానంగా పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్‌ బడుల వైపు మళ్లించే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మూడోవంతు ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. ఉన్నత పాఠశాలల్లో పని చేయాల్సిన టీచర్లను క్లస్టర్‌ టీచర్లుగా, ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎంలుగా మార్చేసింది. ట్రైనింగ్‌ల పేరుతో టీచర్లను బడికి దూరం చేయడమే కాకుండా బోధనేతర పనులతో టీచర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. బదిలీలు. ప్రదోన్నతులు ముగిసి మూడు నెలలు పూర్తయినా ఇంకా కొందరు టీచర్లు పాత స్థానాల్లోనే పని చేస్తున్నారు. ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ సమస్యకు కూటమి ప్రభుత్వం నేటికీ పరిష్కారం చూపలేదు.

డీఏలన్నీ పెండింగ్‌లోనే..

టీచర్లకు న్యాయబద్ధంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన వాటిపై కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నోరు మెదపడంలేదు. ప్రతి సంవత్సరం జనవరి, జూలై మాసాల్లో అంటే ప్రతి ఆరు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరవు భత్యం ప్రకటిస్తోంది. దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం డీఏ ఇవ్వాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 12వ పీఆర్‌సీని కూడా ప్రభుత్వం ఇంతవరకూ వేయలేదు. మధ్యంతర భృతి (ఐఆర్‌) ఊసే లేదు. సీపీఎస్‌ స్థానంలో పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)తీసుకొస్తామని హామీపై కూడా కూటమి సర్కారు నుంచి స్పందన లేదు.

కూటమి ప్రభుత్వం సమస్యలు

పట్టించుకోవడంలేదని ఆగ్రహం

15 నుంచి 19 వరకూ

యూటీఎఫ్‌ నిరసనలు

ఈ నెల 25న విజయవాడలో

ప్రభుత్వంపై రణభేరి

ఈ నెల 17 వరకూ ఏపీటీఎఫ్‌

నిరసన వారం

ఉపాధ్యాయ సమస్యలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గురువారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యాం. 12న మండల కేంద్రాల్లో నిరసనలు, 13, 14 తేదీల్లో ప్రజా ప్రతినిధులకు వినతులు ఇవ్వడం, 15న డివిజన్‌ కేంద్రాల్లో, 16న జిల్లా కేంద్రాల్లో నిరసనలు, 17న ముఖ్యమంత్రితో పాటు సీఎస్‌లకు వాట్సాప్‌, ఈ–మెయిల్‌ల ద్వారా వినతులు ఇవ్వాలని నిర్ణయించాము.

– ఆది బయన్న, జిల్లా కార్యదర్శి, ఏపీటీఎఫ్‌

ఉపాధ్యాయుల ‘పోరుబాట’ 1
1/1

ఉపాధ్యాయుల ‘పోరుబాట’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement