పుట్టపర్తి టౌన్: జిల్లా సమాచార పౌరసంబంధాలశాఖ సహాయ సంచాలకులుగా సీహెచ్ పురుషోత్తం గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నంద్యాల జిల్లా డీఐపీఆర్‌ఓగా పనిచేస్తూ సహాయ సంచాలకులుగా జిల్లాకు వచ్చారు. ఇక్కడ ఏడీగా పనిచేస్తున్న వేణుగోపాల్‌రెడ్డి డీడీగా పదోన్నతిపై నెల్లూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఏడీగా బాధ్యతలు స్వీకరించిన పురషోత్తంకు సమాచార శాఖ అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. బదిలీపై వెళ్లిన వేణుగోపాల్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఏడీ మాట్లాడుతూ జిల్లాలో పాత్రికేయుల సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
నేరాల అదుపులో సీసీ కెమెరాల పాత్ర కీలకం
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా నేరాల అదుపులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌తో పాటు సీసీ కెమెరాలు, బోర్డు రూమ్, వీడియో కాన్ఫెరెన్స్ హాల్ విభాగాన్ని ఎస్పీ రత్న సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ డీజీపీ, డీఐజీ సహకారంతో పాటు ప్రభుత్వ అనుమతితో ట్రంప్ షూలే పరిశ్రమ భాగస్వామ్యంతో పోలీస్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 2700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
కదిరి, హిందూపురం, మడకశిర ప్రాంతాల్లో సబ్‌కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లా కేంద్రంలో 345 మ్యాట్రిక్స్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలో పెనుకొండ దర్మవరం, పుట్టపర్తిలో కూడా సబ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా అధునాతన సాంకేతికత పరిజ్ఞానంతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డీఎస్పీలు విజయకుమార్, ఆదినారాయణ, శ్రీనివాసులు, ఆర్‌ఐలు వలి, మహేష్, సీఐలు శ్రీనివాసులు, సోషియల్ మీడియా మోహన్, సీసీ చిరంజీవి, సోషియల్ మీడియా ఎస్‌ఐ మునిప్రతాప్, ఐటీ కో ఇన్‌చార్జ్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మద్యం మత్తులో యువకుడి హల్‌చల్
మడకశిర: పట్టణంలో మద్యం మత్తులో ఓ యువకుడు బుధవారం రాత్రి హల్‌చల్ చేశాడు. మద్యం సేవించి బీరు బాటిల్ పగులగొట్టి గాజు ముక్కలను చేతిలో పట్టుకుని వీధుల్లో వీరంగం సృష్టించాడు. పగులగొట్టిన బీరు బాటిల్‌తో ఊరు మారెమ్మ ఆలయ సమీపంలో రెచ్చిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అలాగే ఎస్‌బీఐ ప్రధాన రహదారిలో కూడా యువకుడు అర్థనగ్నంగా తిరగడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. కోటవీధి, అమరాపురం రోడ్లలో యువకుడు హల్‌చల్ చేశాడు. అమరాపురం బస్టాండ్ సమీపంలోనే మద్యం షాపు ఉంది. ఈ మద్యం షాపులో మందు కొనుగోలు చేసి కొందరు యువకులు ఫూటుగా మద్యం తాగుతుండడంతో ఈపరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.
పాముకాటుతో మహిళా రైతు మృతి
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని ఓబుళనాయనపల్లికి చెందిన మహిళా రైతు సరస్వతి (55) గురువారం పాముకాటుతో మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. సరస్వతి తన పొలంలో కలుపు తీస్తుండగా కాలికి ఏదో కాటు వేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. సరస్వతికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

సమాచారశాఖ ఏడీగా సీహెచ్ పురుషోత్తం