
గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని గృహనిర్మాణశాఖ అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పురోగతిపై సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 72,338 ఇళ్లు మంజూరయ్యాయని, ఇప్పటి వరకు 28,240 ఇళ్లు పూర్తి అయ్యాయన్నారు. మిగిలిన 40,009 ఇళ్లలో 36,200 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అక్టోబర్ 15 నాటికి జిల్లాలో 9,984 ఇళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని ఆ దిశగా ఇళ్లు పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు.
పారదర్శకంగా యూరియా పంపిణీ..
జిల్లాలో పారదర్శకంగా యూరియా పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో యూరియా పంపిణీ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యానికి తావులేకుండా యూరియా పంపిణీ సజావుగా జరిగేలా చూడాలన్నారు.
చెరువులన్నీ నీటితో నింపాలి..
జిల్లాలో ఉన్న చెరువులను నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని చెరువుల స్థితిగతులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 15 చెరువులు పూర్తి నీటి సామర్థ్యంతో ఉన్నాయని, 75 శాతం సామర్థ్యంతో 17 చెరువులు ఉన్నాయని, 50 శాతం సామర్థ్యంతో 55 చెరువులు ఉన్నాయన్నారు. జిల్లాలో 284 చెరువుల్లో మోస్తరుగా నీరు ఉందన్నారు. మొత్తంగా 371 చెరువుల్లో నీరు ఉందన్నారు. జిల్లాలో 1186 చెరువుల్లోని 815 చెరువుల్లో నీరు లేదని, హంద్రీ–నీవా ద్వారా కృష్ణానీటితో మరిన్ని చెరువులను నింపడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.