జిల్లాలోని ఆస్పత్రులన్నీ కిటకిట
అపరిశుభ్రత కారణంగా విస్తరిస్తున్న మలేరియా, డెంగీ, టైఫాయిడ్
పెనుకొండ రూరల్/హిందూపురం టౌన్: విష జ్వరాలు వ్యాప్తి చెందడంతో హిందూపురంలోని జిల్లాస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. జిల్లాస్పత్రిలో సాధారణ సమయాల్లో 800 నుంచి వెయ్యి వరకు ఓపీ నమోదు అవుతుండగా గత వారం రోజులుగా వెయ్యి నుంచి 1,200కు దాటింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోగుల రద్దీతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. ఓపీ ముగిసిన తర్వాత ఎమర్జెన్సీ విభాగానికి రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆస్పత్రిలో సాధారణ రోజుటోల 60 నుంచి 80 మంది ఐపీలో ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 120కు పైగా చేరుకుంది.
పేరుకుపోతున్న మురుగు
ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని పలు గ్రామాల్లో మురుగు పేరుకు పోయి దోమలు వృద్ధి చెందాయి. దోమకాటుతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇదే అదునుగా భావించిన పలు ప్రైవేట్ క్లినిక్‌ల నిర్వాహకులు అక్రమార్జనకు తెరలేపారు. రెఫరల్ వైద్యంతో ఆర్‌ఎంపీలు జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు సకాలంలో విధులుకు హాజరు కాకపోవడంతో రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ క్లినిక్‌లను ఆశ్రయించాల్సి వస్తున్నట్లుగా తెలుస్తోంది. నాలుగు నెలల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 13 డెంగీ కేసులు నమోదు కావడం కలవరం రేపుతోంది.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన ఓపీ వివరాలు
మే : 3,76,934
జూన్ : 4,16,619
జూలై : 4,59,666
ఆగస్టు : 2,15,200
(ఇప్పటి వరకు)