
సీఎం చంద్రబాబు మాట్లాడుతుండగానే వెళ్లిపోతున్న మహిళలు
విసుగెత్తించిన సూపర్ హిట్ సభ
చంద్రబాబు ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే జనం తిరుగుముఖం
టీడీపీ కేడర్, పోలీసులు ఎంత ఆపినా ఆగని వైనం
ప్రసంగం సగం కూడా పూర్తి కాకనే గ్యాలరీలు ఖాళీ
సభా ప్రాంగణం వద్ద తగిన ఏర్పాట్లు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు
మండుటెండలో ఉక్కపోతతో అల్లాడిపోయిన మహిళలు
అనంతపురం: ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్’ పేరుతో బుధవారం అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే జనం ఇళ్ల బాట పట్టారు. ముఖ్యమంత్రి ప్రసంగం సగం కూడా పూర్తి కాకనే గ్యాలరీలన్నీ ఖాళీ అయ్యాయి. జనాన్ని ఆపేందుకు టీడీపీ కేడర్, పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
అడిగి మరీ చప్పట్లు !
సీఎం చంద్రబాబు ప్రసంగం కూడా ఆద్యంతం ‘ఆత్మస్తుతి–పరనింద’ చందాన సాగింది. తాము చేసిన కార్యక్రమాల గురించి గొప్పలు చెబుతూనే చప్పట్లు కొట్టాలని సీఎం పదేపదే జనాన్ని కోరడంతో వచ్చిన వారు విసుగెత్తిపోయారు. సీఎం కోరినా చప్పట్లు కొట్టడానికి ఆసక్తి చూపించకపోవడంతో ‘ఏమయ్యా నేను ఉచితంగా గ్యాస్ ఇచ్చాను. అది వినియోగిస్తున్నారు కదా కనీసం చప్పట్లు అయినా కొట్టండి’ అంటూ బతిమాలుకోవడం గమనార్హం. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో జనసేన నాయకులు జెండాలను ఎగురవేయడంతో వాటిని కిందికి దించాలని సీఎం పదేపదే కోరారు. అయినా జనసేన కార్యకర్తలు పోటాపోటీగా జెండాలను ప్రదర్శించడం కనిపించింది. దీనిపై టీడీపీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తన ప్రసంగాన్ని ఐదు నిమిషాల్లోపే ముగించడంపై పలువురు చలోక్తులు విసిరారు. ‘సూపర్ సిక్స్’ పూర్తి స్థాయిలో అమలు చేయకనే సూపర్ హిట్ కార్యక్రమం ఏర్పాటు చేయడంపై ఆయనకు ఇష్టం లేదేమో! అంటూ పలువురు చర్చించుకున్నారు.
నానా అవస్థలు..
సభా ప్రాంగణం వద్ద జనం నానా అవస్థలు పడ్డారు. మండుటెండలో ఉక్కపోతతో అల్లాడిపోయారు. పలువురు వేడి తట్టుకోలేక వాంతులు చేసుకున్నారు. కేవలం కొన్ని గ్యాలరీల్లోనే కుర్చీలు వేసి, చాలా చోట్ల వేయకపోవడంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిల్చోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎందుకు ఇక్కడికి వచ్చాం దేవుడా అంటూ నిట్టూర్చారు.
పోలీసు ఆంక్షలతో కష్టాలు ..
సూపర్ సిక్స్ సభ సందర్భంగా జిల్లాలో పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం గమనార్హం. ఏకంగా అనంతపురం నగరానికి 5 కిలోమీటర్ల దూరం నుంచే బస్సులను, వాహనాలను దారి మళ్లించడంతో ప్రయాణికులకు దిక్కుతోచని స్థితి నెలకొంది. అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. హైదరాబాద్–బెంగళూరు మార్గంలో వాహనాలను వడియంపేట– బుక్కరాయసముద్రం–నాయనపల్లి క్రాస్– నార్పల– ధర్మవరం–ఎన్‌ఎస్ గేట్ మీదుగా మళ్లించడంతో తీవ్ర ఇక్కట్లు పడాల్సి వచ్చింది. మధ్యలో నార్పల–బత్తలపల్లి మార్గం సరిగా లేకపోవడంతో ప్రయాణంలో నరకం కనిపించింది. సాధారణంగా అనంతపురం నుంచి పెనుకొండ వద్ద ఉన్న కియా కంపెనీకి ఉద్యోగులు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోయేది. కానీ బుధవారం అదనంగా మరో 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది.
యంత్రాంగానికీ ఇక్కట్లు..
సభ పూర్తిగా పార్టీ కార్యక్రమమే అయినా అధికార యంత్రాంగాన్ని భాగస్వాములను చేశారు. దాదాపు 10 జిల్లాల నుంచి పోలీసులను కేటాయించారు. ఈ క్రమంలో ఖాకీలు కూడా ఇబ్బందులు పడ్డారు. బందోబస్తు చర్యలను పర్యవేక్షించాల్సింది పోయి జనం సభ నుంచి వెళ్లిపోకుండా కాపలా కాయాల్సి వచ్చింది.

అభివాదం చేస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం