
ఆటోను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు
● ముగ్గురికి తీవ్రగాయాలు
బత్తలపల్లి: మండలలోని పోట్లమర్రి సమీపంలో సోమవారం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ధర్మవరం నుంచి బత్తలపల్లికి ప్రయాణికులతో బయలుదేరిన ఆటో పోట్లమర్రి సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా తాడిపత్రి నుంచి ధర్మవరానికి వెళుతున్న ఆర్టీసీ బస్సు.. ద్విచక్ర వాహనదారుడిని ఓవర్‌టేక్ చేస్తూ ఢీకొంది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న తాడిమర్రి మండలం మద్దలచెరువు గ్రామానికి చెందిన బాలవెంగళరెడ్డి, చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామానికి చెందిన వరదరాజులు, బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఈరయ్యకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోకిరీకి దేహశుద్ధి
కదిరి అర్బన్: వివాహితను వేధించిన పోకిరీకి స్థానికులు దేహశుద్ధి చేశారు. కదిరి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లమాడ మండలానికి చెందిన యువకుడు మహేష్ మద్యం మత్తులో ఓ వివాహితతో ఆమె ఇంటి వద్ద అసభ్యంగా ప్రవర్తిస్తూ తన కోరిక తీర్చాలని గొడవకు దిగాడు. గమనించిన భర్త, బంధువులు వెంటనే మహేష్‌ను పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా, ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని సీఐ నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రైవేట్ బస్సుల ఢీ
●ముగ్గురికి గాయాలు
చెన్నేకొత్తపల్లి: స్థానిక 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకరికి కాలు విరిగింది. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. కేరళలోని అలపూరకు చెందిన ఏడుగురు యువకులు హైదరాబాద్‌లో కావడి ఉత్సవాన్ని ముగించుకుని తమ మినీ బస్సులో ఆదివానం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం ఉదయం చెన్నేకొత్తపల్లి వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారి పక్కన ఆపిన కియా కంపెనీను వెనుక నుంచి ఢీకొనడంతో మినీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కేరళకు చెందిన అర్జున్‌కు ఎడమ కాలు పాదం వద్ద విరిగింది. అగిల్, రాహుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినటుపోలీసులు తెలిపారు.
రైల్వేస్టేషన్‌లో వృద్ధుడి మృతి
గుంతకల్లు: స్థానిక రైల్వేస్టేషన్‌లోని మూడో ప్లాట్‌ఫారంపై ఓ గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ మహేంద్ర తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి ప్లాట్ ఫారంలోని 22వ పోల్ వద్ద అనారోగ్యంతో మృతి చెందాడు. చామఛాయ రంగు కలిగి ఉన్నాడు. గడ్డం పెరిగి ఉంది. ఆచూకీ తెలిసిన వారు 98661 44616కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు.

ఆటోను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు

ఆటోను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు