
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందజేసిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 233 వినతులు అందాయి. కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. పెండింగ్, బియాండ్ ఎస్‌ఎల్‌ఎ, రీఓపెనింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్‌చార్జ్ డీఆర్వో సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, డీపీఓ సమత, వివిద శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం
సీజీ ప్రాజెక్ట్‌లో తమకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించి న్యాయం చేయకపోతే తమకు అత్మహత్యలే శరణ్యంమని ప్రాజెక్ట్ మత్స్యకార సహకార సంఘం సభ్యుడు రమణా నాయక్‌తో కలసి పలువురు మత్యకారులు కలెక్టర్ వద్ద గోడు వెల్లబోసుకున్నారు. తనకల్లు మండలంలోని సీజీ ప్రాజెక్ట్ మత్య్సకార సహకార సంఘంలో సభ్యులుగా ఉన్న తమకు తెలియకుండా మత్య్సకార శాఖ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించిన శంకరయ్య నెల్లూరు ప్రాంతానికి చెందిన వారికి చేపల వేటకు అనుమతులు ఇచ్చారన్నారు. 50 టన్నులకు పైగా చేపలను పట్టుకుని వారు అమ్ముకున్నారన్నారు. గతంలోనూ పలుమార్లు కదిరి ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదని, ఇప్పటికై నా తమకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు.