
అది హిట్ కాదు.. సూపర్ చీట్ సభ
● చంద్రబాబు 14 నెలల్లో
జిల్లాకు వెలగబెట్టింది శూన్యం
● రాప్తాడు మాజీ ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఫైర్
రాప్తాడురూరల్: ‘చంద్రబాబు ఎన్నికల ముందు 200కు పైగా హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్‌లో రెండు పథకాలు అరకొరగా అమలు చేయగానే ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్’ అంటున్నారు. అది సూపర్ హిట్ కాదు సూపర్ చీట్ సభ’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో తలపెట్టిన ‘అన్నదాత పోరు’కు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆదివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలకు రూ. 10 లక్షల కోట్లు అవసరం అవుతాయని, ఇప్పటిదాకా కనీసం రూ. 50 వేల కోట్ల పథకాలు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. లేదంటే ప్రతినెలా రూ. 2 వేలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారన్నారు. జిల్లాలో ఉపాధి లేక వలసలు వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్న పథకాలేవీ ఆపను... వాటితో పాటు అదనంగా ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ‘చేయూత, ఆసరా, నేతన్న నేస్తం’ అందించలేదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దుష్ప్రచారం చేసి అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పి ఈరోజు ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు యూరియా కొరత కనిపించలేదా? బ్లాక్‌మార్కెట్‌కు తరలించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
14 నెలల్లో ఏం వెలగబెట్టారు?
ఈ 14 నెలల్లో జిల్లాకు చంద్రబాబు ఏం వెలగబెట్టారని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్‌ను తిడుతూ లోకేష్ వద్ద మెప్పు పొందాలని చూస్తున్నారన్నారు. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామని ఒక్క ఇల్లయినా ఇచ్చారా అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి అందులో 7 నిర్మాణాలు కూడా పూర్తి చేశారన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత వాటిని సంపూర్ణంగా ప్రైవేట్‌పరం చేశారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి ఆర్నెల్లలో ప్రజలకు రూ. 16 వేల కోట్ల వాతలు పెట్టారన్నారు. గ్రేటర్ రాయలసీమ పరిధిలో రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తే సంపూర్ణంగా నీటి ప్రాజెక్టులు పూర్తవుతాయని, అలాంటి వాటిని పక్కన పెట్టేసి అమరావతికి మాత్రమే పరిమితమయ్యారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు అనుమతులు తీసుకొచ్చేందుకు ఎందుకు చిత్తశుద్ధి చూపించడం లేదని విమర్శించారు. హంద్రీ–నీవా వెడల్పులో భాగంగా గత ప్రభుత్వం 6,300 క్యూసెక్కులకు అనుమతులిచ్చి పనులు ప్రారంభిస్తే దానిని 3,800 క్యూసెక్కులకు కుదించడం వంచన కాదా అన్నారు. లైనింగ్ పనులను కేవలం చిత్తూరు జిల్లాకు నీటిని తీసుకెళ్లేందుకు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడం జిల్లా రైతులకు మోసం చేయడం కాదా అని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలనూ మోసగించిన చంద్రబాబుకు అనంతకు రావడానికి అర్హత ఉందా అని ప్రశ్నించారు. పయ్యావుల కేశవ్ ఫెయిల్యూర్ మినిస్టర్ అని , మరో మంత్రి సవితమ్మకు పులివెందుల వెళ్లి దొంగ ఓట్లు వేయించే శ్రద్ధ జిల్లా ప్రజల పట్ల లేదని విమర్శించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ధిల్లీలో ఉంటారో, లక్నోలో ఉంటారో, బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంటారో ఎవరికీ తెలీదన్నారు.
ఆ ఎమ్మెల్యేలు అన్నమే తింటున్నారా?
అనంతపురం, రాప్తాడు ఎమ్మెల్యేలు కనీసం కడుపునకు అన్నం తింటున్నారా అని మండిపడ్డారు. వారి నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఇళ్ల నిర్మాణాలను 14 నెలలుగా విజిలెన్స్ తనిఖీల పేరుతో నిలబెట్టారని, ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారంటే ఆ ఇద్దరికీ సిగ్గుందా అని దుయ్యబట్టారు. అసమర్థ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధనాపేక్ష కోసం పేదల ఇళ్ల నిర్మాణం అటకెక్కించారని ధ్వజమెత్తారు. సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్, వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, బండి పవన్, లింగారెడ్డి, లోకనాథరెడ్డి, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.