
రాష్ట్రంలో అసమర్థ పాలన
● మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి
నల్లమాడ: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధరరెడ్డి ఆరోపించారు. ఈ నెల 9న పుట్టపర్తిలో తలపెట్టిన అన్నదాత పోరు పోస్టర్లను నల్లసింగయ్యగారిపల్లిలోని తన స్వగృహంలో ఆదివారం పార్టీ నాయకులతో కలసి ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో యూరియా కొరత నెలకొందన్నారు. ప్రభుత్వం చేతగాని తనం కారణంగా బ్లాక్ మార్కెట్‌లో రూ.500 నుంచి రూ.600 లకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిచండంలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా నెరవేర్చకుండానే సక్సెస్ మీటింగ్‌లు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 66 లక్షలు ఉన్న సామాజిక పింఛన్లలో ఇప్పటికే ఆరు లక్షలు తొలగించారని, వీటిని 50 లక్షలకు కుదించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి... రైతుల శ్రేయస్సు, ఆర్థిక భద్రతకు నిరంతరం కృషి చేశారన్నారు. వేరుశనగ, వరి, చిరుధాన్యాలు అన్నింటికి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలు నిర్మించి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, మందులు, వ్యవసాయ పనిముట్లు రాయితీపై అందించడమే గాక ఏ సమయంలో ఏ పంట వేయాలో, ఏయే మందులు వాడాలో వ్యవసాయ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వచ్చారన్నారు. రైతు సమస్యలపై ఈ నెల 9న మంగళవారం పుట్టపర్తి ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు టీడీ కేశవరెడ్డి, శేషురెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌హెచ్ బాషా, రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీలా రెడ్డి, సంయుక్త కార్యదర్శి దేశాయి భారతీరెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి సతీష్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి అంజినప్ప, నియోజకవర్గ అధ్యక్షుడు ఆసాది గంగిశెట్టి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కన్యాకుమారి, పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబులపతి, ఎంపీపీ పెడబల్లి రమణారెడ్డి, కన్వీనర్లు జయప్ప, రవీనాయక్, మాజీ కన్వీనర్ పొరకల రామాంజనేయులు, ఎస్టీ సెల్ విజయకుమార్ నాయక్, సర్పంచ్‌లు జగన్‌మోహన్ చౌదరి, మల్లికార్జున , నాగరాజునాయుడు, నరసింహమూర్తి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, నారాయణరెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, దాదిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.