
యూరియా పంపిణీలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు
ప్రశాంతి నిలయం: యూరియా పంపిణీలో అక్రమాలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో యూరియా మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా సరఫరా, నిల్వలలో తేడాలు రాకూడదన్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై 6ఏ కేసులు నమోదు చేస్తామన్నారు. యూరియా సరఫరాలో లోటుపాట్లు తలెత్తకుండా అర్డీవోలు, వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రైతులకు సమయానుకూలంగా ఎరువుల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. ఆ రోజుకు ఎంత సరఫరా అవుతుంది, ఎంతమందికి పంపిణీ చేస్తారనే వివరాలు ముందుగానే రైతులకు తెలియజేయాలన్నారు. ఈ–క్రాప్ నమోదు తప్పనిసరిగా చేపట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, వ్యవసాయ శాఖ జిల్లా ఇన్‌చార్జ్ అధికారి రామునాయక్, మార్క్‌ఫెడ్ డీఎం గీతా, డీసీఓ కృష్ణానాయక్, జిల్లా పరిశ్రమల అధికారి నాగరాజు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శుభదాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్