ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు

Sep 7 2025 7:08 AM | Updated on Sep 7 2025 7:08 AM

ఉద్యో

ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు

బత్తలపల్లి: వలంటీర్‌ చేసే పనులు చేయిస్తూ తమ ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారని సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్‌ గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి బత్తలపల్లిలో మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకుని ఎంపీడీఓ నరసింహనాయుడుకు వినతిపత్రం అందజేశారు. తమకు కేటాయిస్తున్న వలంటీర్‌ విధులను బహిష్కరిస్తున్నామన్నారు. సర్వేల పేరుతో ఇంటింటికీ తిప్పుతూ ఆత్మగౌరవం దెబ్బతీసేలా చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండలంలోని 11 గ్రామ సచివాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు.

పుట్టపర్తి టౌన్‌: ప్రభుత్వం సచివాలయం ఉద్యోగులను హీనంగా చూడటం బాధాకరమని మున్సిపాలిటీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సరేంద్రరెడ్డి పేర్కొన్నారు. వలంటీర్ల విధులను ఉద్యోగులతో చేయించచడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు మోహన్‌, నరసింహ, లావణ్య, కవిత, రామకృష్ణ, రఫీ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

9న ఎకాలజీలో ‘ఫార్మా’ అడ్మిషన్‌ మేళా

అనంతపురం అగ్రికల్చర్‌: ఫార్మా రంగంలో శిక్షణ, ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 9న అనంతపురం ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌లో అడ్మిషన్‌, ఉద్యోగ మేళా ఏర్పాటు చేసినట్లు ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ మల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికై న యువతీ యువకులకు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌, విజయవాడలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ, వసతి సదుపాయం ఉంటుందన్నారు. 2023, 2024, 2025లో బీఎస్సీ లేదా ఎంఎస్సీ (బీజెడ్‌సీ) కెమిస్ట్రీ, డిప్లొమా ఇన్‌ మెకానికల్‌ ఎలెక్ట్రానిక్స్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, బీ–ఫార్మా లేదా డీ ఫార్మా లేదా ఎం ఫార్మా, బీఎస్సీ లేదా ఎంఎస్సీ (మైక్రోబయాలజీ), బీఈ లేదా బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌) అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 9న బయోడేటాతో మేళాకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు స్థానిక ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఎకాలజీ కార్యాలయం లేదా 81217 17846 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

పెనుకొండ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. కియా ఏరియా స్టేషన్‌ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మునిమడుగు పంచాయతీ చిన్నపరెడ్డిపల్లికి చెందిన మారుతి (28) అమ్మవారిపల్లికి చెందిన రామాంజి అనే యువకుడితో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం శుక్రవారం ద్విచక్రవాహనంపై రాంపురం వెళ్లారు. అక్కడ పని చూసుకుని తిరుగుపయనమయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో పెనుకొండలోని 44వ జాతీయ రహదారిపై కొత్తచెరువు రోడ్డు మలుపు వద్ద రోడ్డు దాటే సమయంలో బెంగళూరు నుంచి తాడిపత్రికి వెళ్తున్న ఫార్చూనర్‌ కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో మారుతి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రామాంజిని 108 వాహనం ద్వారా హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తీసుకెళ్లారు. మారుతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కియా స్టేషన్‌ ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

అంజినప్పకు

‘బళ్లారి రాఘవ’ పురస్కారం

బత్తలపల్లి: తేనె తెలుగు కల్చరల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు, కళాభిషేకం నిర్వాహకులైన శేషయ్యగారిపల్లి అంజినప్ప ప్రతిష్టాత్మక బళ్లారి రాఘవ జాతీయ పురస్కారం అందుకున్నారు. శనివారం బళ్లారి కల్చరల్‌ యాక్టివిటీస్‌ అసోసియేషన్‌ వారు బళ్లారిలోని బీపీఎస్‌సీ కళాశాల శరవణ ఆడిటోరియంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కళాప్రపూర్ణ బళ్లారి రాఘవ జాతీయ పురస్కారాన్ని బళ్లారి రాఘవ మనవడైన రఘురామ్‌, అనంతపురం డిప్యూటీ కలెక్టర్‌ రఘునాథ్‌ చేతుల మీదుగా అంజినప్ప అందుకున్నారు. అవార్డుతో పాటు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కారం అందుకున్నారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు శీలా బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి యశ్వంత్‌రాజ్‌, కోశాధికారి మల్లేసు, కార్యవర్గ సభ్యులు తదితరులు అంజినప్ప కళాసేవలను కొనియాడారు.

బంగారు గొలుసు అపహరణ

ధర్మవరం రూరల్‌: ఆరుబయట పడుకున్న మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. నిమ్మలకుంట గ్రామంలో లలితమ్మ తన భర్త కుళ్లాయప్పతో కలిసి ఇంటి ఆవరణలో మంచంపై నిద్రిస్తోంది. శనివారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు వచ్చి లలితమ్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు (మంగళసూత్రం) లాక్కెళ్లారు. బాధితురాలు లేచి గట్టిగా అరిచేలోపు దుండగులు చీకట్లో కనిపించకుండా పారిపోయారు.

ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు 1
1/2

ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు

ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు 2
2/2

ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement