
యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం
మడకశిర: రైతులకు అవసరమైన యూరియాను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. యూరియా కొరతకు ప్రభుత్వ చేతకాని తనమే కారణమని మండిపడ్డారు. కేంద్రం నుంచి డిమాండ్ మేరకు రాష్ట్రానికి యూరియాను తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. యూరియా సమస్యను పరిష్కరించి రైతులను ఆదుకోని చేతకాని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ రైతులకు ఆర్బీకేలు, పీఏసీఎస్‌ల ద్వారా పూర్తి స్థాయిలో యూరియాను అందించారని గుర్తు చేశారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించారని తెలిపారు. ఉచిత పంటల బీమా, రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు సకాలంలో అందించి రైతులను వైఎస్ జగన్ ఆదుకున్నారని పేర్కొన్నారు. ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణ, సున్నావడ్డీ పథకాలను రద్దు చేసి రైతులను నిండా ముంచారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్‌సీపీ నాయకులకు 41ఏ నోటీసులు
చెన్నేకొత్తపల్లి: రాప్తాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు సత్యనారాయణరెడ్డి, రామాంజనేయులు, వెంకటేష్‌కు చెన్నేకొత్తపల్లి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. వీరు గత నెలలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీకి చెందిన ఫణీంద్ర ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురినీ ఎస్‌ఐ సత్యనారాయణ శనివారం స్టేషన్‌కు పిలిపించి, 41ఏ నోటీసులు అందజేశారు.

యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం