
భర్త చేతిలో భార్య హతం
● అనుమానంతోనే ఘాతుకం
గాండ్లపెంట: భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తూపల్లికి చెందిన కుటాగుళ్ల మన్సూర్ కదిరిలోని ఓ చికెన్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. భార్య కుటాగుళ్ల మెహతాజ్ (28) శుక్రవారం ఇంట్లో చెప్పకుండా మదనపల్లికి వెళ్లింది. భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం వచ్చింది. తనకు చెప్పకుండా ఎందుకు ఊరికి వెళ్లావంటూ అదే రోజు రాత్రి భార్యతో మన్సూర్ గొడవపడ్డాడు. ఈ క్రమంలో రోకలిబండ తీసుకుని భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో మెహతాజ్ అక్కడికక్కడే మృతి చెందింది. ఇదంతా పన్నెండేళ్ల కుమారుడి ఎదుటే జరిగింది. శనివారం కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కదిరి రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు.