
గురువులే మార్గనిర్దేశకులు
పుట్టపర్తి అర్బన్: నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే మార్గనిర్దేశకులని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఉన్న మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. డీఈఓ కిష్టప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేసీ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ.. ఎవరు ఏ రంగంలో.. ఏ స్థాయికి వెళ్లినా దాని వెనుక గురువుల కృషి ఉంటుందన్నారు. తరగతి గదిలోనే వారు జాతి నిర్మాణానికి పునాదులు వేస్తారన్నారు. అందుకే గురువును దైవంతో సమానంగా చూస్తామన్నారు. ఉపాధ్యాయులు కూడా తమ గురుతర బాధ్యతను గుర్తించి పనిచేయాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకుని పిల్లలను గొప్ప విద్యావంతులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం 71 మందికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో సర్వశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ దేవరాజ్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు గంగాద్రి, శ్రీనివాసులు, బూక్యా కాలేనాయక్, సోమ్లా నాయక్ తదితరులు ఉన్నారు.
గురుపూజోత్సవంలో
జేసీ అభిషేక్ కుమార్
71 మందికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం

గురువులే మార్గనిర్దేశకులు