
ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
బత్తలపల్లి: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం ఆర్డీఓ మహేష్ ఎరువుల దుకాణాదారులను హెచ్చరించారు. గురువారం మండల కేంద్రమైన బత్తలపల్లిలోని ఎరువుల దుకాణాల్లో తహసీల్దార్ స్వర్ణలత, వ్యవసాయాధికారి ఓబిరెడ్డితో కలిసి తనిఖీలు నిర్వహించారు. మన గ్రోమోర్, మంజునాథ్ ఎరువుల దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్, స్టాక్‌ను తనిఖీలు చేశారు. రికార్డుల ప్రకారం బత్తలపల్లి మండలంలో రైతులకు 13 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. కావాల్సిన రైతులకు రెండు బ్యాగులు చొప్పున విక్రయించాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లో రైతు సేవా కేంద్రాలకు కూడా యూరియా సరఫరా అవుతుందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఏపీఐఐసీతో భూమి కొనుగోలు ఒప్పందం
ప్రశాంతి నిలయం: ఆగ్నేయస్తా యూనిజెర్టిక్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు తమ పారిశ్రామిక అవసరాల కోసం మడకశిర మండలం ఆర్.అనంతపురం, గౌడెనహళ్లి గ్రామాలలో ఏపీఐఐసీతో భూమి కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. భూమి పొజిషన్ పొందిన వెంటనే పరిశ్రమల ఏర్పాటు పనులు చేపట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారన్నారు.
ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితులకు రిమాండ్
బుక్కరాయసముద్రం: మైనర్ బాలుడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పుల్లయ్య తెలిపారు. బీకేఎస్ మండలం కొట్టాలపల్లిలో ఓ బాలుడు 2022, ఏప్రిల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి తల్లి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు నలుగురు యువకులపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. పాత కేసులు త్వరగా పూర్తి చేయాలన్న ఎస్పీ ఆదేశాల మేరకు.. బాలుడు ఆత్మహత్య కేసులో లోతైన విచారణ అనంతరం నలుగురు యువకులను అరెస్ట్ చేసి గురువారం న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
టీ తాగి వచ్చే లోపు నగదు అపహరణ
రాయదుర్గం టౌన్: స్థానిక లక్ష్మీబజార్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సమీపంలోని ఓ టీ కొట్టు వద్ద నిలిపిన ద్విచక్రవాహనం సైడ్ బ్యాగ్‌లోని నగదును దుండగుడు అపహరించుకెళ్లాడు. వివరాలు.. గుమ్మఘట్ట మండలం జె.వెంకటంపల్లికి చెందిన వడ్డే కుళ్లాయప్ప వ్యక్తిగత అవసరాల నిమిత్తం గురువారం మధ్యాహ్నం ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1.70 లక్షలు నగదు తీసుకున్నాడు. అనంతరం నగదును తన ద్విచక్ర వాహనం సైడ్ బ్యాగ్‌లో ఉంచుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైన ఆయన లక్ష్మీబజార్‌లోని టీ కొట్టు వద్ద ఆపి టీ తాగి వచ్చేలోపు నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.