
ఇద్దరు టీచర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు
మాణిక్యం ఇసాక్
తెలుగు టీచర్
జయచంద్ర
హిందీ టీచర్
పుట్టపర్తి అర్బన్: జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఏటా అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రొద్దం మండలం కోగిర ఉన్నత పాఠశాల హిందీ టీచర్ జాబిలి చాంద్‌బాషా అలియాస్ జయచంద్ర, కొత్తచెరువు మండలం బండ్లపల్లి ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ మాణిక్యం ఇసాక్ ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన విజయవాడలో జరిగే కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతులు మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు.
జయచంద్ర తాను పని చేసిన పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు విద్యాభివృద్ధికి పాటుపడ్డారు. వినూత్న పద్ధతుల్లో పిల్లలకు అర్థం అయ్యేలా బోధిస్తున్నారు. జాబిలి కలం పేరుతో కవితా రచన, జాతీయ గీతం ‘జనగణమన’తో లక్ష గళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనకు 2017లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2018లో అనంతపురం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించాయి. అలాగే సేవా రత్న, మదర్‌థెరీసా పురస్కారం తదితర 70 వరకూ రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
మాణిక్యం ఇసాక్‌కు బోధనలో 30 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన 216 పద్యాల పుస్తకాలు ఆవిష్కరించారు. 2025లో మహమ్మద్ ఇక్బాల్ జాతీయ పురస్కారం పొందారు. పదో తరగతిలో ఏటా వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఆయన వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ప్రస్తుతం టీచర్లు, డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారు.

ఇద్దరు టీచర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు